Pawan Kalyan- YS Jagan : ఏపీలో నయా రాజకీయం నడుస్తోంది. అందుకు జనవరి వేదిక కానుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్న క్రమంలో జగన్ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను.. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పాటు గడపనున్నారు జగన్. పార్టీని సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జగన్ పర్యటన కొనసాగనుంది. ఈ తరుణంలో పవన్ సరికొత్త ఆలోచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందుకే తాను సైతం జనాల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. జిల్లాల పర్యటన చేయాలని భావిస్తున్నారు.
* కూటమి బాధ్యతలు పవన్ కు
ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో బిజీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలనను తీసుకెళ్లే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. పనిలో పనిగా ప్రతి నియోజకవర్గంలో జనసేన బలోపేతమే లక్ష్యంగా భేటీలు జరపనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సూపరిపాలనను వారికి వివరించడంతో పాటు జనసేన విస్తరణకు సైతం ప్రయత్నం చేయనున్నారు. తద్వారా జగన్ ప్రయత్నాలకు పవన్ చెక్ చెప్పనున్నారు. దాదాపు 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో పవన్ పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
* పాజిటివిటీ తగ్గకుండా
కూటమి ప్రభుత్వంపై పాజిటివిటీ తగ్గకుండా పవన్ తన వంతు ప్రయత్నాలు చేస్తారు. రాష్ట్రానికి ప్రాధాన్యత అంశాలుగా ఉన్న అమరావతి రాజధానితో పాటు పోలవరం పై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అదే సమయంలో కూటమి సమన్వయ బాధ్యతలను పవన్ తీసుకొనున్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ.. కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకునే బాధ్యత కూడా పవన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు దైనందిన పాలన చంద్రబాబు కొనసాగిస్తారు. కానీ వాటి ఫలాలను ప్రజలకు అందుతున్నాయా లేవా అన్నది పవన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. గత ప్రభుత్వం వైఫల్యాలను అధిగమించే క్రమంలో.. కూటమి సర్కార్ చేస్తున్నదేమిటి అన్నదానిపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు పవన్. సరిగ్గా జగన్ ప్రజల్లోకి వచ్చే సమయంలోనే.. పవన్ జిల్లాల టూర్లకు ప్లాన్ చేస్తుండడం విశేషం. మొత్తానికి అయితే 2025 ప్రారంభంలోనే రాజకీయ మెరుపులు, విమర్శలకు వేదిక కానుంది. తెలుగు నాట కాక రేపనుంది.