Revanth Reddy: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కని అవకాశం రేవంత్ కు..

కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయిలో చూసుకుంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అనేది అత్యున్నతమైనది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా 30 సంవత్సరాల లో ఎప్పుడూ లేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 6, 2023 12:12 pm

Revanth Reddy

Follow us on

Revanth Reddy: మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన మూడు రోజుల తర్వాత తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అతిరథ మహారధులందరూ హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ స్టేడియంలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అరుదైన అవకాశాన్ని దక్కించుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కని అవకాశాన్ని ఆయన చేక్కించుకోబోతున్నారు.

పీసీసీ చీఫ్ నుంచి..

కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయిలో చూసుకుంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అనేది అత్యున్నతమైనది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా 30 సంవత్సరాల లో ఎప్పుడూ లేదు. అయితే రేవంత్ రెడ్డి ప్రదేష్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడం అరుదైన రికార్డుగా చెప్పవచ్చు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలం పుంజుకుంది. అయితే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇక గతంలో అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 2004, 2009 సంవత్సరాలలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ రెండు సమయాల్లో కూడా పిసిసి అధ్యక్షుడిగా ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. ఇక 1975, 1989లో మర్రి చెన్నారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ రెండు సమయాల్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఆ అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది.

పార్టీని ఏకతాటిపై నిలిపారు

2017 లో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి.. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. 2019లో మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2021 జూన్ 25న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. ఇక అప్పటినుంచి ఆయన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడంలో సఫలీకృతులయ్యారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే రెండవ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.