India Alliance: కాంగ్రెస్ పతనం.. కూటమి నుంచి ఔట్

ఇప్పుడు కూటమి సమావేశం అంటేనే భాగస్వామ్య పక్షాలు దూరంగా జరిగిపోతున్నాయి. బుధవారం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.

Written By: Dharma, Updated On : December 6, 2023 12:24 pm

India Alliance

Follow us on

India Alliance: ఇండియా కూటమికి బీటలు వారాయా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ డీలా పడిందా? ఆ పార్టీ నాయకత్వానికి మిగతా రాజకీయ పక్షాలు ఒప్పుకోవడం లేదా? సార్వత్రిక ఎన్నికల వరకు కూటమి కొనసాగే అవకాశం లేదా? దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఆది నుంచి కాంగ్రెస్ నాయకత్వం విషయంలో మిగతా రాజకీయ పక్షాలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మిగతా రాజకీయ పక్షాలను కలుపు కెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఓటమి చవిచూసిందని.. ఆ పార్టీ నాయకత్వంలో కూటమి కొనసాగితే నష్టమని మిగతా రాజకీయ పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పుడు కూటమి సమావేశం అంటేనే భాగస్వామ్య పక్షాలు దూరంగా జరిగిపోతున్నాయి. బుధవారం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పక్షాల నాయకులకు స్వయంగా ఫోన్ చేశారు. సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఉన్నపళంగా ఈ సమావేశాన్ని రద్దు చేశారు. దీనికి తమిళనాడులో వర్షాలను సాకుగా చూపడం విశేషం. దీంతో అసలు కూటమి సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగుతుందా? లేదా? అన్న అనుమానం వెంటాడుతోంది.

నాయకత్వం బాధ్యతలు వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సమావేశంపై అన్ని రాజకీయ పక్షాలకు వర్తమానం పంపించింది. కానీ తాము హాజరు కాలేమని చాలామంది నాయకులు ముఖం మీదే చెప్పేసినట్లు తెలుస్తోంది. తుఫాను కారణంగా తాను హాజరు కాలేనని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పిన కారణం సహేతుకంగా కనిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ కు విశ్వాస పాత్రుడైన స్నేహితుడు. తాను హాజరుకానులేనని సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తేల్చేశారు. తదుపరి సమావేశం నిర్వహించిన ఆయన హాజరు కావడం అనుమానమే. అసలు ఈ సమావేశం సమాచారం తనకు లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పడం విశేషం. ఇంట్లో శుభకార్యం ఉన్నందున తాను హాజరు కాలేనని ఆమె తేల్చేశారు. అటు నితీష్ కుమార్ సైతం తనకు ఒంట్లో నలతగా ఉందని.. అందుకే హాజరు కావడం లేదని చెప్పడం విశేషం.

అయితే భాగస్వామి పక్షాలన్నీ డుమ్మా కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని వాయిదా వేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో అంతులేని విశ్వాసం పెరిగింది. అందుకే ఇండియా కూటమిలోని మిగతా రాజకీయ పక్షాలను పెద్దగా లెక్క చేయలేదు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక చోట మాత్రమే గెలుపొందగలిగింది. రెండు చోట్ల తమ వద్ద ఉన్న అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పట్టు బిగించడం ప్రారంభించాయి. ఓటమి నాయకత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకోవాలన్న డిమాండ్ ఊపందుకునే అవకాశం ఉంది.