Congress: కాంగ్రెస్ నాయకుల ‘చలో ఢిల్లీ’.. మళ్లీ మొదలయ్యిందా?

కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సిఎల్పీ నాయకుడు ఎవరు కావాలి? ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే దానిపై ఇటీవల ఎల్లా హోటల్లో సుదీర్ఘ సమావేశం జరిగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 6, 2023 12:09 pm

Telangana Congress

Follow us on

Congress: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే వీటిని నెటిజన్లు రకరకాలుగా రూపొందిస్తున్నారు.. ఇవి చూడడానికి వైవిధ్యంగా ఉండటంతో నవ్వొస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని.. అప్పట్లో కేటీఆర్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలను కొంతమంది ప్రస్తుత పరిస్థితికి ఆపాదిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సిఎల్పీ నాయకుడు ఎవరు కావాలి? ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే దానిపై ఇటీవల ఎల్లా హోటల్లో సుదీర్ఘ సమావేశం జరిగింది. అయితే దీనిపై ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధాంతరంగా ఎవరికి వారుగా బయటికి వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి కబురు రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు వంటి వారు ఢిల్లీ వెళ్లారు.. ఆ తర్వాత కొంత సమయానికి రేవంత్ రెడ్డికి కబురు వచ్చింది. ఆయన ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్లారు.. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించి చివరికి కేసి వేణుగోపాల్ ద్వారా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రకటింపజేసింది.

ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని..

అయితే ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నెటిజెన్లు మీమ్స్ సృష్టించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అలవాటే అని, వారి అధిష్టానం పిలిస్తే వెంటనే వెళ్ళిపోతారని కామెంట్లు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు చవిచూడాల్సి వస్తుందో వివరించి చెప్పారు..బాత్ రూం వెళ్లాలన్నా కూడా ఢిల్లీకి పోవాలని, వారు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. నాడు కేటీఆర్ చెప్పిన మాటలే నేడు నిజం అవుతున్నాయని నెటిజన్లు ప్రస్తుతం చలోక్తులు విసురుతున్నారు.

మరి ఫామ్ హౌస్ మాటేమిటి

ఢిల్లీ అధిష్టానం గురించి మాట్లాడుతున్న నెటిజన్ల కు మరికొందరు వినూత్న రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి వారు కచ్చితంగా అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. మరి ఇన్ని నీతులు చెబుతున్న భారత రాష్ట్ర సమితి నాయకులు ఫామ్ హౌస్ కు ఎందుకు వెళ్తున్నారు? ఫామ్ హౌస్ లో చేతులు కట్టుకొని ఎందుకు నిల్చుని ఉంటున్నారు ? అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నాయకత్వం కార్యాలయం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ వెళ్తే తప్పేముంది? ఢిల్లీ పాకిస్తాన్లో లేదు కదా అంటూ వారు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో రకరకాల వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు.