Namasthe Telangana: అధికారాంతమున “నమస్తే తెలంగాణ”లో సమూల మార్పులు

కెసిఆర్ గవర్నమెంట్ సెకండ్ టర్మ్ లో పూర్తి నెగిటివ్ లైన్ తీసుకుంది. మొన్నటి ఎన్నికల దాకా అదే విధంగా వార్తలు రాసింది (కేటీఆర్ వార్తలకు, కెసిఆర్ వార్తలకు మాత్రం ప్రయారిటీ ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : December 16, 2023 10:14 am

Namasthe Telangana

Follow us on

Namasthe Telangana: జర్నలిజం బేస్ గా నడిచే (డప్పు కొట్టడమే కదా ఇప్పుడు పని) పత్రికలు ప్రభుత్వాలతో పని లేకుండానే నడుస్తాయి. కొన్నిసార్లు యాజమాన్యాలు ప్రభుత్వాలకు అనుకూల రాతలు రాయడం వల్ల సేఫ్ జోన్ లో ఉంటాయి. ఉదాహరణకు ఈనాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసేది. రోశయ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత లైన్ మార్చుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి విషయంలోను ఇదే ధోరణి ప్రదర్శించింది.. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా గులాబీ భజనకు అలవాటు పడిపోయింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికొస్తే అది మొదటి నుంచి ఒక తిక్క క్యారెక్టర్.. దాని లైన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి కెసిఆర్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత నిప్పులు చిమ్ముతుంది.. కెసిఆర్ గవర్నమెంట్ సెకండ్ టర్మ్ లో పూర్తి నెగిటివ్ లైన్ తీసుకుంది. మొన్నటి ఎన్నికల దాకా అదే విధంగా వార్తలు రాసింది (కేటీఆర్ వార్తలకు, కెసిఆర్ వార్తలకు మాత్రం ప్రయారిటీ ఇచ్చింది. కేటీఆర్ తో రాధాకృష్ణ ఇంటర్వ్యూ కూడా చేశాడు). ఇక ఆ సాక్షి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అంటే అది ఈ పది సంవత్సరాలలో జనాన్ని కదిలించే ఒక్క వార్త కూడా రాయలేదు. స్థూలంగా చెప్పాలంటే ఏపీలో దాని పాత్ర ఎంతో.. తెలంగాణలో కూడా అంతే..

అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మొదటి దాకా అధికారిక పత్రిక అనే హోదా అనుభవించిన నమస్తే తెలంగాణ గురించి. మొదట్లో ఈ పత్రికను రాజం స్థాపిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కెసిఆర్ కొనేశాడు. మొదట్లో ఈ పత్రిక మాది కాదని.. కెసిఆర్ ఫ్యామిలీ దబాయించేది.. తర్వాత ఆ పత్రిక మాదే అని గర్వంగా చెప్పిన స్థాయికి వచ్చింది. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు నమస్తే తెలంగాణ కెసిఆర్, కెసిఆర్ పార్టీ డప్పు మాత్రమే కొట్టేది. అందులో ప్రతిపక్షానికి కొంత కూడా స్పేస్ ఇచ్చేది కాదు. ఇక ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల మీద ఎంత బురద చల్లాలో అంత బురద చల్లింది. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి.. కెసిఆర్ గురించి ఆయన కుటుంబం గురించి రాసి రాసి ఉంది కాబట్టి.. కొత్తగా రాయడానికి ఏమీ లేదు కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ వార్తలకు.. ముఖ్యమంత్రి వార్తలకు ప్రయారిటీ ఇస్తోంది. దీన్నే విధిరాత అంటారేమో.. కలలో కూడా రేవంత్ రెడ్డి ఫోటోలు ప్రచురించేందుకు ఇష్టపడని నమస్తే తెలంగాణ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వార్తలకు ప్రయారిటీ ఇవ్వడం విశేషం..

సాధారణంగా మన సమాజం అధికారం ఉన్నవాళ్లను చూసే చూపు ఒక రకంగా ఉంటుంది. అదే అధికారం లేకుంటే ఇచ్చే గౌరవం కూడా వేరే విధంగా ఉంటుంది. ఈ పరిస్థితిని నమస్తే తెలంగాణ అనుభవిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు ఏ బి సి లెక్కలతో పని లేకుండా కెసిఆర్ ఎడాపెడా ప్రకటనలు ఇచ్చేవాడు. దీంతో నమస్తే తెలంగాణ రెట్టించిన ఉత్సాహంతో వార్తలు కుమ్మేసేది. అందులో పని చేసే ఉద్యోగులకు గొప్ప జీతాలు మాత్రం ఇవ్వడంలో వెనుకంజ వేసేది. చివరికి తమ జీతాల కోసం పాలమూరు ఎడిషన్ లో పనిచేసే జర్నలిస్టులు నిరసనకు దిగారు.. అప్పట్లో ఈ విషయాన్ని కేటీఆర్ కు చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఏం చెప్పారో తెలియదు కానీ ఆ తర్వాత తమ నిరసనను విరమించారు.. ఇలా చెప్పుకుంటూ పోతే నమస్తే తెలంగాణలో జరిగిన అద్భుతాలు ఎన్నో.. అయితే ఇప్పుడు తాజాగా నమస్తే తెలంగాణలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ పత్రిక సర్కులేషన్ అంతంత మాత్రమే. కేవలం భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు మాత్రమే ఆ పేపర్ చదువుతారు.(కేటీఆర్ కూడా నమస్తే తెలంగాణను చివరగా చదువుతానని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు) ఇక ఇప్పుడు ఎలాగూ అధికారంలో భారత రాష్ట్ర సమితి లేదు. ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తాయనే ఆశ లేదు. అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి ప్రైవేట్, కార్పొరేట్ యాడ్స్ విచ్చలవిడిగా వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందని నమ్మకం లేదు. పైగా రోజురోజుకు ముద్రణ వ్యయం తడిసిమోపెడవుతోంది. ఈ క్రమంలో ఆరు ఎడిషన్లు గా ఉన్న నమస్తే తెలంగాణ ఇప్పుడు మూడుకు పడిపోనుంది. అంటే ఖమ్మం ఎడిషన్ ను వరంగల్ కు షిఫ్ట్ చేస్తున్నారు. నల్లగొండ ఎడిషన్ ను హైదరాబాదులోకి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఎడిషన్ లో మెదక్, రంగారెడ్డి కొనసాగుతున్నాయి.. పాలమూరు ఎడిషన్ కూడా హైదరాబాదులోకే వెళ్లిపోయే అవకాశాలున్నాయి.. ఇక కరీంనగర్ ఎడిషన్లో ఆదిలాబాద్ ఎడిషన్ ఎప్పటినుంచో కొనసాగుతోంది.. సో మొత్తానికి పది జిల్లాల తెలంగాణ కాస్త 33 జిల్లాలు అయితే.. ఆ 33 జిల్లాలు ఇప్పుడు మూడు ఎడిషన్లలో నిక్షిప్తమయ్యాయి. మరి ఆయా జిల్లాల్లో నిర్మించిన భవనాలను, ఏర్పాటు చేసుకున్న ప్రింటింగ్ యంత్రాలను ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అన్నట్టు గతంలో సాక్షి ఇదే విధంగా ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది.. మరి ప్రస్తుత నమస్తే తెలంగాణ చేస్తున్న ప్రయోగం ఎ ల్లాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పట్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తాయా అనేది ఒక అనుమానమే? ఎందుకంటే ప్రింట్ మీడియాకు పెద్దగా ఆదరణ లేదు. ప్రస్తుతం అనుకున్న ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ రెండు పత్రికలకు పెద్దగా ఇబ్బంది లేదు.