PM Modi vs KCR: మునుగోడు ముగిసిపోయినా టిఆర్ఎస్, బిజెపి మధ్య రగడ చల్లారడం లేదు. ఈసారి రామగుండం రూపంలో మరో ఘర్షణ రాజుకుంది. ప్రధానమంత్రి మోడీ రామగుండంలో పర్యటించనున్న నేపథ్యంలో దాని చుట్టూ రాజకీయం అల్లుకుంటున్నది. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన కర్మగారాన్ని ఇప్పుడు ప్రధాని ప్రారంభించడం ఏమిటని టిఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.. ఆ పార్టీతో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు గొంతు కలుపుతున్నాయి.. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే 95% ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నదని టిఆర్ఎస్ విమర్శిస్తోంది.. అప్పులు పుట్టనివ్వకుండా ఆంక్షలు విధించడమే కాకుండా, వడ్ల కొనుగోలు లో దోబూచులాడుతోందని మండిపడుతోంది.. వివిధ పథకాల కింద రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతున్నదని తప్పుపడుతోంది.. ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరదీసి తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసిందని మండిపడుతోంది.. రామగుండం ఎరువుల కర్మాగారం ఇదివరకే ప్రారంభమైందని, ఉత్పత్తి కూడా మొదలైందని, అలాంటి కర్మగారాన్ని మళ్లీ ప్రారంభించడం ఏమిటని సిపిఎం ప్రశ్నిస్తోంది.

ఉద్యోగాల సంగతి తేల్చాకే
కర్మాగారంలో స్థానికులకు 95% ఉద్యోగాలు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు టిఆర్ఎస్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ వంటి విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి.. ఉద్యోగాల సంగతిని తేల్చాకే ప్రధానమంత్రి ఇక్కడ అడుగు పెట్టాలని, లేకపోతే అడ్డుకుంటామని హెచ్చరించాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం యువతకు అన్యాయం చేస్తోందని, ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, రైల్వే శాఖలో లక్షల ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వడంలో అన్యాయం ఇస్తోందని ధ్వజమెత్తుతున్నారు.
కెసిఆర్ దూరం
ప్రధాని రాష్ట్రంలో చేపట్టే అధికారిక పర్యటనకు కూడా ముఖ్యమంత్రి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.. నిజానికి ఇది పూర్తి స్థాయిలో అధికారిక కార్యక్రమమే. ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం ఆనవాయితీ.. అయితే గతంలో ప్రధాని చేపట్టిన మూడు పర్యటనలకు గైర్హాజరైనట్టే… ఇప్పుడు కూడా కెసిఆర్ వెళ్లడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.. అయితే ఆ మూడు కూడా ప్రైవేట్ కార్యక్రమాలు కావడం ఇక్కడ గమనార్హం.. ముచ్చింతల్ సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మోదీ వచ్చారు.. కానీ స్వాగతం పలికేందుకు కేసీఆర్ హాజరు కాలేదు. అప్పటినుంచే మోదీ, కెసిఆర్ మధ్య వైరం మొదలైంది. రామానుజుల విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకంపై కెసిఆర్ పేరు ఏర్పాటు చేయకపోవడంతో ఆయన నొచ్చుకున్నారని, అందుకే వెళ్లలేదనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత మే 26న ప్రధాన మంత్రి మోడీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు.

దానికి కూడా కెసిఆర్ హాజరు కాలేదు.. అదే సమయంలో బీజేపీయేతర పక్షాలను కూడగట్టడంలో భాగంగా కేసీఆర్ అదేరోజు బెంగళూరుకు వెళ్లి.. మాజీ ప్రధాని దేవె గౌడతో భేటీ అయ్యారు. ప్రధాని హైదరాబాద్ కు వచ్చిన రోజే కెసిఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవడంపై అప్పట్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత జూలై 2 నుంచి నగరంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి.. అందులో భాగంగా జూలై 3న ప్రధాని నగరానికి వచ్చారు.. అది పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో కేసీఆర్ పర్యటనకు దూరంగానే ఉన్నారు.. ఇప్పుడు అధికారిక పర్యటనలో భాగంగా రామగుండం వస్తున్నప్పటికీ దానికి కెసిఆర్ హాజరు కావడం లేదు.. వాస్తవానికి ప్రధాని పర్యటిస్తే ప్రోటో కాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సి ఉంటుంది.. ఆ అధికారిక పర్యటన రాజధానికి బయట అయితే ప్రభుత్వం తరఫున ప్రతినిధిని పంపవచ్చు.. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కావడంతోనే టిఆర్ఎస్ అగ్గిమీద గుగ్గిలం అవుతుందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.
50 వేల మందిని తరలించే ప్లాన్
మోడీ రామగుండం పర్యటన నేపథ్యంలో ఆ సభకు 50 వేల మందిని తరలించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు.. రామగుండం ఫ్యాక్టరీ ప్రారంభించిన తర్వాత మోడీ దాన్ని జాతికి అంకితం చేస్తారు.. మొదట ఈ సభకు లక్ష మందికి తరలించాలని అనుకున్నప్పటికీ.. స్థలా భావం వల్ల 50వేల మందికి కుదించారు. స్టేడియంలో కుర్చీలు వేసినా 30 వేల మందికి మించి పట్టరు. ఎన్టి పి సి టౌన్షిప్ లోని మహాత్మా గాంధీ స్టేడియంలోనే సభను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.. ప్రధాని పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, సభకు ఎక్కువ మంది రైతులను తరలించేందుకు బిజెపి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల నుంచి రైతులను తరలించేందుకు బిజెపి నాయకులు సన్నద్ధమవుతున్నారు.. 74 అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లోని ఫంక్షన్ హాల్ లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి రైతులను మోదీ పర్యటనను ఆద్యంతం తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.