PM Modi Visit Ramagundam: మునుగోడులో హోరాహోరీ పోరాటం జరిగి వారం కూడా కాలేదు. కానీ అది సాల్వాడార్ గడియారం మాదిరి కరిగిపోయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ఇప్పుడు రామగుండంలో పెరిగిన ఉష్ణోగ్రత. ప్రతి ఫలితానికి కొన్ని పర్యవసనాలు ఉంటాయి. గుణపాఠాలూ కూడా ఉంటాయి. ఎవరూ ఒప్పుకోరు, వెనక్కి తిరిగి చూసుకోరు. తమలోకి తాము కూడా చూసుకోరు. నిజాన్ని ఎదుర్కోవాలంటే భయం.. సత్యాన్ని దాచిపెట్టి ఇతరులను, తమను కూడా మభ్యపెట్టుకుంటారు. అంకెలు అడ్డుపెట్టుకొని అడ్డగోలు వాదనలు చేస్తారు. ధైర్యాన్ని అభినయిస్తారు. అల చేతుల్లో రేపటి అద్భుత విజయాలను ప్రదర్శిస్తారు.. కానీ ఉన్న మాట చెబితే ఉలిక్కిపడతారు.. ఈ విన్యాసాలు అవసరం కాబట్టే, అతి సులభ సూత్రకరణలూ, అతి గంభీర వాదనలూ తెరమీదకి వస్తున్నాయి.. మునుగోడులో ఐదు వేలకు, మధ్య జరిగిన పోటీ అని, అంతకుమించి మరేమీ లేదని ఒకరు అంటారు. ఇది మతతత్వ నిరంకుశ కేంద్ర ప్రభుత్వానికి, ప్రజాస్వామిక సెక్యులర్ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన యుద్ధమని మరొకరు అంటారు. ఈ సత్యం ఈ రెండిటి మధ్య ఉన్నదా, సత్యానంతర కాలంలో ఈ ప్రశ్నలకు అర్థమే లేదా? గెలిచినవారు గెలిచిన మాట నిజమే కానీ, అదేమంత గెలుపు కాదని, ఓడిన వారి ఓటమి ఏమంత ఓటమి కాదని సాధారణ జనం కూడా అనుకుంటున్నప్పుడు ఆత్మ విమర్శలు చేసుకోవడం కష్టమే.

తార్కిక ఫలితం ఏమీ రాలేదు
మునుగోడు యుద్ధం తెలంగాణలో ఒక ఖరీదైన పోరాటం. ఎప్పుడూ చూడని వాహనాలు, నాలుక ఎప్పుడూ కోరుకోని రుచులు ఈ గడ్డను పలకరించినప్పుడే కరెన్సీ కట్టలు తెంచుకున్నది. మునుగోడు ముగిసిందని చాలామంది అనుకుంటున్నారు కానీ కొత్త పిలక రూపంలో రామగుండం వెలిసింది. అడుగడుగునా వెలుస్తున్న అగడ్తలలో అది కూడా ఒకటి. ఇక ప్రధానమంత్రి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వ విముఖతకు మధ్య ఒక అగాధం. అలాగే రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య ఒక ఆగాధం. ఇలా నిరంతర రాజకీయ ఉద్రిక్తత లతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉన్నారు. అధికారాన్ని సాధించుకునేందుకు, లేదా ఉన్న అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకునేందుకు ఇలాంటివి ఈ ఏడాది పాటు సాగుతాయి. అయితే ఈ పోరాటం ఫలితం ఇస్తుందా? సత్పరిపాలనకు, ప్రజాస్వామ్యానికి ఈ సన్నివేశం ప్రత్యామ్నాయమవుతుందా?ప్రధానమంత్రి పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ శిబిరం నుంచి వస్తున్న ప్రశ్నలు న్యాయమైనవే కావొచ్చు. మా ఇలాకాలోకి ఎందుకు వస్తున్నావ్ అన్నట్టున్న ధోరణి మాత్రం సరైనది కాదు. ఉద్యమ పార్టీ జాతీయ పార్టీగా మారుతున్న క్రమంలో ఆశ్చర్యకరంగా ఈ ప్రాంతీయ గర్జనలకే అర్థం ఉండదు.
ఆయనకు ఎవరు చెబుతారు
కేంద్రంతో యుద్ధం, జాతీయస్థాయిలో చక్రం అంటే అంశాలు వచ్చే ఎన్నికలలో కోరుకుంటున్న విజయానికి పెద్దగా ఉపయోగపడవని, బిజెపి విధానాల మీద చేస్తున్నామని చెప్పే పోరాటానికి తగినంత విశ్వసనీయత సమకూరలేదని టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అధిపతికి ఎవరైనా చెప్పగలిగితే బాగుండు. లేక ఆయన వినగలిగితే బాగుండు. తన పరిపాలన మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రతరం అవుతుందని గుర్తించడమే మునుగోడు నుంచి ఆయన నేర్చుకోవాల్సిన గుణపాఠం. గజకర్ణ గోకర్ణ విద్యలు ఆ వ్యతిరేకతను మాయం చేయలేవు. ప్రభావం చూపకుండా ఆపలేవు. ఇది ఆయన నమ్మినా, నమ్మకపోయినా గుణపాఠం. జాతీయ రాజకీయాలు అనగానే అహో ఓహో అని జేజేలు పలికిన అనుచరగణం ఈ నిజాన్ని చెప్పేందుకు ధైర్యం చేయరు. సర్వశక్తులు మోహరించినా, అందరికంటే ఓటుకు నోటు అధికంగా ఇచ్చినా, ప్రభుత్వ పథకాల అమలను గురిపెట్టి మరీ నిర్వహించినా, పొత్తు పెట్టుకున్న పార్టీలు 15 వేల ఓట్లు తెచ్చినా, లోపం ఎక్కడ ఉన్నది చూడలేకపోతే అది ముమ్మాటికి చూపులోపమే. కమ్యూనిస్టుల కూడిక, కాంగ్రెస్ తీసివేత బిజెపిని ఓడించిందని, అదే ఫార్ములా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని అనుకుంటారు.
అని అది పొరపాటు. మునుగోడులో బిజెపి అభ్యర్థికి చాలా ఓట్లు వచ్చాయి. అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కావడంవలన అన్ని ఓట్లు వచ్చాయని గత ఎన్నికల ఓట్ల వివరాలు చూస్తే తెలుస్తుంది. కానీ రాజగోపాల్ వంటి అభ్యర్థులను ఎంతమందిని బిజెపి తేగలదు? బిజెపికి బలమైన అభ్యర్థి సమకూరిన చోట, కాంగ్రెస్ అభ్యర్థి తెచ్చుకున్న ఓట్లు టిఆర్ఎస్ ను రక్షిస్తాయి. అలాగే బిజెపి అభ్యర్థులు తెచ్చుకునే ఓట్లు టిఆర్ఎస్ను రక్షిస్తాయి.. ఇటువంటి ప్రయోజనం సిద్ధించే విధంగా బిజెపిని పెంచడం కాంగ్రెస్ని తగ్గించడం అనేది కేసీఆర్ ఆలోచించారు.. అమలు చేస్తున్నారు కూడా. అయితే బిజెపిని పెంచే ప్రయత్నం డోస్ పెరిగిపోయి మునుగోడులో ప్రాణం మీదికి వచ్చింది.. బిజెపికి ఓట్ల వర్షం కురిసింది కేవలం పట్టణాల్లోనే కాదు. గ్రామాల్లో కూడా… పొత్తులతో కుదిరిన 10,000 రక్షించకపోతే ఈపాటికి అనంతర పరిణామాలు ఉదృతంగా ఉండేవి.. ఇప్పుడు కూడా అంత సజావుగా ఉంది అనుకోవడానికి లేదు.. రాష్ట్రంలో విస్తృతంగా ఈడి దాడులు జరుగుతున్నాయి.. ఆర్థిక మూలాలు అల్లాడిపోయే చర్యలు జరుగుతున్నాయి. తన వ్యూహం మంచి చెడ్డలను ఆయన తరచి చూసుకుంటున్నారు అనుకోలేము.. ఏ సమయంలో ప్రధాని పర్యటన మీద కాలు దువ్వుతూ, అను బీజేపీ మాత్రమే రాష్ట్రంలో పోటీ దారులమనే సంకేతాలను స్థిరపరుస్తున్నారు.

పాపం ఈ వ్యూహాన్ని బద్దలు కొట్టే శక్తి కాంగ్రెస్కు ఎక్కడ ఉంది? తెలంగాణలో ప్రగతిశీల సమాజాన్ని తన పని తాను చేసుకుని ఇస్తే ఇటువంటి సమస్యలను కేసీఆర్ ఎదుర్కొని ఉండేవారు కాదు కదా? ప్రజా ఉద్యమాలలో ఉన్న వారిని, తికత నైతికత ఉన్న వారిని ప్రజాప్రతినిధులుగా తీసుకొని ఉంటే, ఇట్లా 50 కోట్లకో, 100 కోట్లకు బేరాలు వచ్చేవి కాదు కదా? బాధ్యతాయుత పరిపాలన అనే కర్తవ్యాన్ని వదిలేసి, ఎన్ని చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం? ముందుగానే చెప్పినట్టు మునుగోడు ఇంకా ముగిసిపోలేదు.. రామగుండం రూపంలో ఉష్ణోగ్రత పెంచింది. అప్పుడెప్పుడో ఒక వ్యాఖ్య వినిపించింది. హస్తం పార్టీని చంపితే పెద్దపులి లాంటి బిజెపి మీదికి వచ్చింది.. దాన్ని ఇప్పుడు కాచుకోవాలి. దానిమీద చేసే పోరాటానికి ధర్మం అనో, స్వీయ అస్తిత్వం అనో పేరు పెడితే తెలంగాణ సమాజం అంగీకరించే పరిస్థితిలో లేదు.. ఎందుకంటే పాల్లేవో, నీళ్ళేవో గుర్తెరిగింది కనుక!