Cyberabad Police: చనిపోయిన ఎస్సైకి పోస్టింగ్‌.. సైబరాబాద్‌లో వింత ఉత్తర్వులు..!

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో లాంగ్‌ స్టాండింగ్‌ అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈమేరకు పోలీస్‌ శాఖలో బదిలీలు జరుగుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్సైల్ని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

Written By: Raj Shekar, Updated On : July 14, 2023 12:57 pm

Cyberabad Police

Follow us on

Cyberabad Police: పోలీశ్‌ శాఖలో రిటైర్మెంట్‌కు ఒక్కరోజు ముందు ప్రమోషన్‌ ఇవ్వడం, బదిలీ చేయడం సాధారణంగా జరుగుతాయి. దీర్ఘకాలికంగా ఒకే డిసిగ్నేషన్‌తో పనిచేసి రిటైర్‌ అయ్యేవారి విషయంలో ఇలా చేస్తారు. కానీ, ఇక్కడ ఎవరూ ఊహించని ఘటన జరిగింది. గుండెపోటుతో ఇటీవల మరణించిన ఎస్సైని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంతర్గతంగా జరిగిన ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. పొరపాటును అంగీకరించాల్సిన పోలీసులు దానిని గురించి కాకుండా అసలు విసయం ఎలా బటయకు వెళ్లిందనే విషయంపై దృష్టిపెట్టడం ఆశ్చర్యంగా ఉంది.

ఏం జరిగిందంటే..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో లాంగ్‌ స్టాండింగ్‌ అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈమేరకు పోలీస్‌ శాఖలో బదిలీలు జరుగుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్సైల్ని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పేరూ ఉంది. ప్రభాకర్‌రెడ్డి జూన్‌ 9న గుండెపోటుతో మరణించారు. గురువారం ఎస్సైల్ని బదిలీ చేసిన ఉత్తర్వుల్లోనూ ఆయన పేరుంది. ఈ ఉత్తర్వులు పోలీసులకు సంబంధించిన అంతర్గత సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే ప్రభాకర్‌రెడ్డి పేరు తొలగించి కొత్త జాబితా విడుదల చేశారు. అయితే ప్రభాకర్‌రెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్‌ పోలీసులు ఆదేశాలివ్వడం విస్మయానికి గురిచేసింది. ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గతంలోనే జాబితా సిద్ధం..
ఎస్సైల బదిలీలకు సంబంధించిన ప్రతిపాదన జాబితా గతంలోనే సిద్ధమైంది. అప్పటికి ప్రభాకర్‌రెడ్డి విధుల్లోనే ఉన్నారు. సాంకేతిక పొరపాటుతో అవే పేర్లతో ఆదేశాలు వెలువడ్డాయి. వెంటనే అప్రమత్తమై కొత్త జాబితా ఇచ్చాం.’ అని సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చారు. పొరపాటును గుర్తించి సరిచేశామని కూడా వెల్లడించారు.

మూడు కమిషనరేట్లలో బదిలీలు
హైదరాబాద్‌ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 13 మంది ఏసీపీల్ని బదిలీ చేస్తూ డీజీపీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి ఇక్కడ బాధ్యతలు అప్పగించారు. మరికొందరికి ఇతర జిల్లాల్లో పోస్టింగ్‌ ఇచ్చారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించిన వారిని త్వరలోనే ఇతర ప్రాంతాల్లో నియమించనున్నారు. మరికొందరు ఏసీపీల బదిలీలున్నాయని అధికారులు తెలిపారు. సైబరాబాద్‌లో 82 మంది ఎస్సైలు.. సైబరాబాద్‌లో 82 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఉత్తర్వులకు అనుగుణంగా ఎస్‌హెచ్‌వోలు రిలీవ్, డ్యూటీ రిపోర్టుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.