Homeఆంధ్రప్రదేశ్‌Chevireddy Bhaskar Reddy : ప్రకాశం గొడ్డుబోయిందా? చెవిరెడ్డికి వైసిపి పగ్గాలు.. బాలినేనికి చెక్!

Chevireddy Bhaskar Reddy : ప్రకాశం గొడ్డుబోయిందా? చెవిరెడ్డికి వైసిపి పగ్గాలు.. బాలినేనికి చెక్!

Chevireddy Bhaskar Reddy : వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. అయినా సరే జగన్ గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఇప్పటికీ అదే పంధాతో కొనసాగుతున్నారు. నా పార్టీ నా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ పునర్నిర్మాణం అంటే.. తాను చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా.. జగన్ అనుసరిస్తున్న తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉంది. ఏ జిల్లాకు ఆ జిల్లా నేతలను బాధ్యులు చేయకుండా.. పక్క జిల్లా నేతలను నియమిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సొంత పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. మరి ఇంత సిల్లీ రాజకీయాలా? అంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది.

వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. జగన్ వెంట నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి నేతబలంగా నిలబడ్డారు. జిల్లాలో పార్టీని నిలబెట్టారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని సైతం వదిలి వైసిపి గూటికి వచ్చారు. సమన్వయంతో వ్యవహరించి 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాను కంచు కోటగా మలిచారు. దాదాపు వైట్ వాష్ చేసే విధంగా ఫలితాలు ఇచ్చారు. కానీ జగన్ మాత్రం బాలినేని తో పాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని నిర్లక్ష్యం చేశారు. మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని పదవి నుంచి తొలగించారు. అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను కొనసాగించారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మొరాయించారు. అతడి అవసరం లేదన్నట్టు వ్యవహరించారు. ఎక్కడో చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో చెవిరెడ్డి ఓడిపోవడం కాదు.. జిల్లా వ్యాప్తంగా పార్టీ ఓడిపోయింది. దారుణ ఫలితాలు ఎదురయ్యాయి.

ప్రకాశం జిల్లా విషయంలో జగన్ ప్రవర్తించిన తీరు విమర్శలకు గురిచేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కానీ జగన్ తీరు మారలేదు. ఇప్పుడు ఏకంగా ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేశారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ లోలోపల మాత్రం నిర్ణయాలు జరిగిపోయాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. దీంతో వైసీపీలోని జిల్లా నేతలంతా గోల పెడుతున్నారు. మా జిల్లాలో మగాళ్లు లేరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అసలు ప్రకాశం జిల్లాతో చెవిరెడ్డికి సంబంధం లేదు. పోనీ ఆయన పేరు మోసిన నాయకుడా? అంటే అది కాదు. సామాజిక సేవ చేసే అలవాటు ఉందా? అంటే అదీ లేదు. పోనీ జనాలతో మమేకమయ్యే పని చేసే నేత అంటే లేదనే సమాధానం వస్తోంది. కానీ ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉండిపోవాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఉండడంతో.. ఆయన దృష్టి ప్రకాశం పై పడినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ సైతం ప్రకాశం జిల్లాలో నమ్మకస్తుడైన నేత భాస్కర్ రెడ్డి అవుతారని భావిస్తున్నారు. అందుకే పార్టీ తరఫున ఆయనను అక్కడ ప్రమోట్ చేస్తున్నారు.

ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పొమ్మను లేక పొగ పెట్టేందుకే భాస్కర్ రెడ్డిని జగన్ ప్రయోగించారని ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సీటును మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వాలని బాలినేని కోరారు. అందుకు జగన్ అంగీకరించలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించారు. ఈ నిర్ణయం నచ్చకపోయినా.. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి బాలినేని మిన్నకుండా ఉండిపోయారు. పార్టీలోనే కొనసాగారు. ఇప్పుడు బాలినేనిని కాదని.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగిస్తే.. ప్రకాశం జిల్లా వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరడం ఖాయం. మెజారిటీ క్యాడర్ పక్క చూపులు చూడడం గ్యారెంటీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular