Ponguleti Srinivasa Reddy journalists: రేపూమాపూ అంటూ దాటవేస్తున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చిందీ లేదు. పాత్రికేయులు పుచ్చుకుందీ లేదో. ఏదో సమావేశాలలో నాయకులు చెప్పడం.. పాత్రికేయులు వినడం పరిపాటిగా మారిపోయింది. ఏడాదిన్నరగా ప్రభుత్వం గుర్తింపును ఎక్స్ టెన్షన్ చేసుకుంటూ పోతోంది గాని.. కొత్త గుర్తింపు కార్డులు మాత్రం ఇవ్వడం లేదు. అయితే ఇన్నాళ్లకు ప్రభుత్వానికి సోయి వచ్చినట్టుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒక కీలక ప్రకటన చేసింది. పాత్రికేయుల విషయంలో మిగతా హామీలను పక్కన పెడితే.. గుర్తింపు విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. పాత్రికేయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి అడుగులు వేస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించారు.. ఖమ్మం జిల్లాలోని వైరాలో టియుడబ్ల్యూజే (ఐజేయు) నాలుగో జిల్లా మహాసభ జరిగింది. ఈ మహాసభకు పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read: కాంగ్రెస్ లో లేకున్నా నాకు సీఎం సీటు ఎందుకొచ్చిందంటే?.. బయటపెట్టిన రేవంత్
గుర్తింపు కార్డుల విషయంలో వచ్చే వారంలో యూనియన్ నాయకులతో చర్చిస్తామని శ్రీనివాసరెడ్డి చెప్పడంతో పాత్రికేయులలో ఆశలు మోసులెత్తుతున్నాయి. గుర్తింపు కార్డుల తర్వాత ఆరోగ్య కార్డులు కూడా ఇస్తామని.. ఇళ్ల స్థలాలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో కేసు పెండింగ్ లో ఉండటం వల్ల.. ఎటువంటి ఆటంకం లేకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని శ్రీనివాసరెడ్డి చెప్పడంతో పాత్రికేయ వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..
భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాత్రికేయులకు గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఆ గుర్తింపు కార్డులను నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది.. కొత్త గుర్తింపు కార్డులను మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేకపోయింది. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే పాత్రికేయుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. అనేక సందర్భాలలో పాత్రికేయులు తమ సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో పాత్రికేయ పెద్దలు చెప్పారు. సమస్య తీవ్రతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి తో చర్చించడంతో.. ఆయన ఈ మేరకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రి వారంలో గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పినప్పటికీ.. ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి దాదాపు నెల నుంచి రెండు నెలల వరకు పడుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు చెబుతున్నారు. గుర్తింపు, ఆరోగ్య కార్డులు ఎలా ఉన్నప్పటికీ.. ఇళ్ల స్థలాలే అసలు సమస్య అని పాత్రికేయులు చెబుతున్నారు. మరి ఈ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.