Revanth Reddy : మనం మాట్లాడే మాట వినసొంపుగా ఉండాలి. ఎదుటివారిలో ఆలోచన కలిగించే విధంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తర్కంతో సంబంధం ఉండాలి.. ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తోందంటే.. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు అలాంటివి కాబట్టి.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మరోసారి తనదైన శైలిలో ప్రసంగించారు..”నేను ఏ స్థానంలో కూర్చున్నా.. ఇంకా ఇంతకంటే ఎక్కువ పని చేసినా.. నాకు గొప్పగా అనిపించదు. నా పనితీరును ప్రశంసిస్తూ సోనియా గాంధీ రాసిన లేఖ అత్యంత గొప్పది.. అదే అన్నిటికంటే విలువైనది. అంతకంటే ఉన్నతమైనది మరొకటి ఉంటుందని నేను అనుకోను.. నా ఆత్మ, రాహుల్ గాంధీ ఆత్మ ఒక్కటే. రాహుల్ భయ్యా మనసులో ఉన్న మాట, నా మనసులో ఉన్న మాట ఒకటే. రాహుల్ భయ్యా మనసులో ఉన్న పనిని నేను చేస్తున్నాను.. నాకు అధినేతగా ఉన్న రాహుల్ భయ్యా. ఏం చెప్పినా బంగారు గీతతో సమానం.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల గణన దేశానికి రోల్ మోడల్ అనే దానికంటే, రేర్ మోడల్ అనడం సబబు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
రేవంత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల గణన అనేది గొప్ప కార్యక్రమం. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దానిని ప్రమోట్ చేసుకోవడంలో రేవంత్ వాడిన భాష అంత గొప్పగా లేదు. మరోవైపు ఆత్మలు, బంగారు మాట.. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు కావు. ప్రతిపక్ష స్థానంలో రేవంత్ ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడినా చెల్లుబాటు అయింది. అధికారంలో ఉన్నప్పుడు.. అది కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు రేవంత్ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పటికే ఆయన ఫోన్ ట్యాపింగ్ పై చేసిన వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితికి అనుకొని వరంలాగా మారాయి. దానికి కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కిందా మీదా పడుతోంది. వాటిని మర్చిపోకముందే కుల గణన, రాహుల్ ఆత్మ, బంగారు మాట అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేయడం మరింత కలకలాన్ని రేపుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో భారత రాష్ట్ర సమితి అనేక రకాలుగా వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు టన్నుల కొద్ది విషాన్ని ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా విభాగాలు నింపుతున్నాయి. కాంగ్రెస్ మీద ఏ స్థాయిలో విష ప్రచారం చేయాలో ఆ స్థాయిలో చేస్తున్నాయి. అలాంటప్పుడు రేవంత్ లాంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చూడాలి. కానీ ఆయన మాత్రం అనుకోకుండా టంగ్ స్లిప్ అవుతున్నారు. తద్వారా భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా గ్రూపులకు టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికైనా వచ్చే సభల్లో రేవంత్ మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. లేకుంటే ఇదిగో ఇలానే విమర్శలకు గురికావలసి వస్తుంది.
నీది కాంగ్రెస్ పార్టీ కాకపోయినా సీఎం సీట్ ఎలా దక్కిందని అందరూ అడుగుతుంటారు
రాహుల్ భయ్యాతో నా ఆత్మ కలిసింది.. రాహుల్ భయ్యా మనసులో ఉన్న పని చేయాలని నేను డిసైడ్ అయ్యాను
నా అధినేత రాహుల్ భయ్యా ఏదైనా చెప్పాడంటే అది నాకు బంగారు గీత – రేవంత్ రెడ్డి pic.twitter.com/FLfX175eS6
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2025