Phone Taping Case
Phone Taping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదట పోలీసు అధికారులే ప్రధాన నిందితులుగా భావించారు. అయితే విచారణ జరిపే కొద్ది మరికొందరు అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అధికారుల గత పాలకుల ఒత్తిడితోనే ఈ పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే విచారణలో ఇప్పటి వరకు ఒక్క నేత పేరు కూడా బయటకు రాలేదు. అయితే కొంత మంది బాధితులు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేవారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)పైనా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు ఉపశమనం కల్పించింది. పంజాగుట్ట(Panjagutta) పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ.. తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం!
కేసు నేపథ్యం..
సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్(Chkradhar Goud) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీశ్‌రావుతోపాటు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కేసు నమోదైంది. తన ఫోన్‌తోపాటు కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్‌లను ట్యాప్ చేశారని, దీని వెనుక హరీశ్‌రావు ఉన్నారని చక్రధర్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై ఆధారాలు లేవని, రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో హరీష్ రావుకు చట్టపరమైన ఉపశమనం లభించడమే కాకుండా, ఈ కేసు దర్యాప్తు ప్రక్రియలో ఎదురైన వివాదాలు కూడా తాత్కాలికంగా సమసిపోయాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు
ఈ కేసు ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) అధికారులు ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, న్యాయమూర్తులు మరియు ఇతర ప్రముఖుల ఫోన్‌లను అనధికారికంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఆధారపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరియు తర్వాత ఈ చర్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యతిరేకులను అణచివేయడానికి మరియు బ్లాక్‌మెయిల్ కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 మార్చి 13న SIB మాజీ డీఎస్పీ డి. ప్రణీత్ రావు అరెస్టుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అతనిపై అనధికారికంగా వ్యక్తుల ప్రొఫైల్స్ తయారు చేయడం, ఫోన్‌లను ట్యాప్ చేయడం మరియు ఎలక్ట్రానిక్ డేటాను నాశనం చేసినట్లు ఆరోపణలు రాగా, ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు.
ప్రధాన నిందితులు:
SIB మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు ఎన్. భుజంగ రావు, మేకల తిరుపతన్న, మాజీ డీసీపీ పి. రాధాకిషన్ రావు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది.