Lagacharla Incident:కలెక్టర్ లగచర్ల ప్రాంతానికి వెళ్లిన సమయంలో అక్కడ ప్రజలు ఒక్కసారిగా అధికారులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. కొంతమంది కలెక్టర్ పై దాడి చేశారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటన వెనుక సురేష్ అనే వ్యక్తి ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతడిని ఏ -1 గా ప్రకటించారు. అయితే సురేష్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో మాట్లాడారని.. మధ్యలో మాజీ మంత్రి కేటీఆర్ తో కూడా మాట్లాడారని సమాచారం. అయితే ఈ విషయంపై డిజిపి ఉన్నతాధికారులను నియమించారు. సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు అభియోగాలు మోపిన సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. ఇతడు గతంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. పోలీసులు కేసులు నమోదు చేయగా.. వాటిని తొలగించడానికి పట్నం నరేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం 14 రోజులు ఆయనను జైలుకు తరలించారు.
రిమాండ్ రిపోర్టులో సంచలనం
పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు..”భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, భారత రాష్ట్ర సమితి ముఖ్య నేతల ఆదేశాలతో లగచర్ల ప్రాంతంలో అధికారులపై దాడి జరిగింది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర చేశారు. నరేందర్ రెడ్డి సురేష్ కు అనేకమార్లు ఫోన్ చేసినట్టు ఒప్పుకున్నారని” రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఫార్ములా రేస్ వ్యవహారంలో కేటీఆర్ ప్రభుత్వ సొమ్ము 55 కోట్లను విదేశాలకు తరలించారని, దానిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణకు ఆదేశించాలని కోరింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళింది. గవర్నర్ ఈ ఫైల్ ను 15 రోజులుగా తన వద్ద పెట్టుకున్నారు. అది అలా ఉండగానే లగచర్ల ఘటనలో కేటీఆర్ పేరు తెరపైకి రావడం సంచలనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేటీఆర్ పేరు రిపోర్టులో పోలీసులు ప్రస్తావించడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు.