Paleru River Overflow: కొద్దిరోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీరు విపరీతంగా వస్తున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు నిండుగా నీటితో కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మత్తళ్లు దునుకుతున్నాయి. దీంతో రైతులు ఉత్సాహంగా వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్లు పూర్తయిన చోట కలుపులు తీస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన నీటి వనరులలో ఒకటి పాలేరు రిజర్వాయర్. కృష్ణా నీటిని నిల్వ చేసేందుకు ఈ రిజర్వాయర్ నిర్మించారు. ఈ రిజర్వాయర్ కు నాగార్జునసాగర్ నుంచి నీరు వస్తుంది. ఈ నీటి ద్వారా పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది. కల్లూరు, బోనకల్, పాలేరు, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, పెనుబల్లి, తల్లాడ, కొణిజర్ల వంటి మండలాల్లోని పంట పొలాలకు సాగునీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ కు కృష్ణానది నుంచి మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే వచ్చే వరదతో కూడా నిండుతుంది.. పాలేరు రిజర్వాయర్ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నిండింది. నిండడం మాత్రమే కాదు అలుగు కూడా పాడుతోంది. ఈ రిజర్వాయర్ పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టుకు ఈ సంవత్సరం ఢోకా లేకుండా పోయింది.
Also Read: రేవంత్‌కన్నా కేసీఆరే బెటరంట..! తాజా సర్వే సంచలనం!
రిజర్వాయర్ అలుగుపడుతున్న నేపథ్యంలో పక్కనే ఉన్న నాయకన్ గూడెం ఏరులో ఆ నీరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం జిల్లా పోలీసులు అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నాయకన్ గూడెం నుంచే సూర్యాపేట, దాని మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. గతంలో నాయకన్ గూడెం ఏరు పారుతున్న సమయంలో ప్రమాదాలు జరిగాయి. ఈసారి అటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడానికి అక్కడి పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.. పాలేరు అలుగు పోస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.