Telangana PACS Elections: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ పాలకవర్గ పోస్టులను నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 905 సొసైటీలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి, చైర్మన్ తో పాటు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం నడుస్తున్న పాలకవర్గం పదవీకాలాన్ని ఇదివరకే పొడిగించగా, శుక్రవారంతో ఈ గడువు కూడా ముగుస్తోంది. అయితే ఈ పదవీకాలం మరో 6 నెలల పాటు పొడిగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లోపు నామినేటెడ్ పద్ధతిలో పాలక ఏర్పాటుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించవచ్చని తెలుస్తోంది. ఈ పద్ధతి ఏపీ లో ఇదివరకే కొనసాగిస్తున్నారు. ఎన్నికల ద్వారా పాలకవర్గాన్ని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. వారే ప్రస్తుతం కొసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పాలకవర్గ చైర్మన్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కన్నా, నామినేటెడ్ పోస్టుల ద్వారా పదవి దక్కించుకోవడమే మంచిదని వారిలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నామినేటెడ్ ద్వారా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అవకాశముంటుందని పార్టీ నాయకులు సైతం సూచిస్తున్నారు. మార్కెట్ కమిటీ ల మాదిరిగా సొసైటీలకు కూడా రిజర్వేషన్ పద్ధతిలో పదవులను పంపిణీ చేయడం వల్ల పార్టీ నాయకులకు, మద్దతుదారులకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారితో పాలకవర్గాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ పదవులను పొందేందుకు సొసైటీలలో సభ్యత్వం ఉన్న విపక్ష మద్దతుదారులు కాంగ్రెస్ గడప తొక్కేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఆ విధంగా కూడా విపక్షాలకు మద్దతు పలికే వారిని తనవైపుకు తిప్పుకోవచ్చని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
మిగతా పార్టీలు ఏమంటున్నాయి..
ఏదో రూపంలో ఎన్నికలు రావాలని ఎదురుచూస్తున్న విపక్షాలు మాత్రం ఈ విషయంలో ఏ రకంగా స్పందించాలి అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న విపక్షాలు పీఏసీఎస్ గురించి ప్రస్తుతం పట్టించుకునే స్థితిలో లేరని తెలుస్తోంది.
Also Read: రేవంత్‌కన్నా కేసీఆరే బెటరంట..! తాజా సర్వే సంచలనం!
గత ఎన్నికల్లో ఏం జరిగింది..
రుణాలు చెల్లించని కారణంగా దాదాపు 14 లక్షల మంది ఓటర్లు ఓటు వేసే, పోటీ చేసే హక్కును కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 905 సొసైటీలో ఉన్న 32,99,088 మంది ఓటర్లలో, 13,98,257 మంది ఓటర్లు బకాయిలు చెల్లించని కారణంగా ఓటు వేసే లేదా పోటీ చేసే హక్కులను కోల్పోయారు. దీని ఫలితంగా ఓటర్ల సంఖ్య గణనీయంగా 43% తగ్గి 19,00,831కి చేరుకుంది.
ఆర్థిక ఇబ్బందులు కాకుండా, లక్షలాది మంది రైతులు రుణ బకాయిలు తిరిగి చెల్లించకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణమాఫీ కోసం ఎదురుచూడటమే కారణమని, అప్పటి అధికార పార్టీ కేవలం తమ అభ్యర్థులను నామినేట్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవడంపై మాత్రమే దృష్టి పెట్టిందనే విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.