Mahbubnagar: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారం ప్రాంతంలో భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాకపోతే అది స్వల్పకాలిక భూకంపం కావడంతో పెద్దగా నష్టం వాటిల్ల లేదు. మేడారం మాత్రమే కాకుండా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
మేడారంలో చోటు చేసుకున్న భూ ప్రకంపనల విషయాన్ని మర్చిపోకముందే ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూ ప్రకంపనలు సంచలనం కలిగించాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో 3.0 తీవ్రతతో భూమి కనిపించింది.. కౌకుంట్ల మండలం దాసరపల్లి గ్రామంలో భూకంప కేంద్రం నమోదయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతం గోదావరికి దగ్గరగా ఉండదు. కృష్ణానదికి కూడా సుదూరంలో ఉంటుంది. గతంలో ఈ ప్రాంతంలో భూకంపాలు చోటు చేసుకున్న సంఘటనలు లేవు. పైగా ఈ ఏరియాలో భూగర్భ గనులు.. మైనింగ్ కార్యకలాపాలు జరగడం లేదు. అన్నిటికి మించి ఈ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు కూడా లేవు. అయితే ఇక్కడ భూమి ఎందుకు కంపించిందనేది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. భూమిలో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయపడ్డారు. వెంటనే వీధుల్లోకి పరుగులు తీశారు..
ఏం జరిగిందంటే
ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం పలు ప్రాంతాలలో భూ ప్రకంపనులు చోటుచేసుకున్నాయి. భూమిలో ఆకస్మికంగా కదలికలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాంతాలలో ఇళ్ల ల్లోని గదులలో భద్రపరిచిన సామాగ్రి కింద పడింది. కొన్ని ప్రాంతాలలో పురాతన ఇళ్ళ పై భాగాలు బీటలు వారాయి. అయితే ఈ ప్రాంతంలో భూకంపం ఇంతవరకు రాలేదు. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు కూడా పెద్దగా సాగడం లేదు. అలాంటప్పుడు ఇక్కడ భూమిలో ఎందుకు ఇలా కదలికలు చోటు చేసుకున్నాయనేది అర్థం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు..” ఉదయం వరకు బాగానే ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఏదో కదిలినట్టు అనిపించింది. పక్కన కట్టేసి ఉన్న గేదెలు అరవడం మొదలుపెట్టాయి. కుక్కలు భీకరంగా అరుపులు అరిచాయి. ఏదో అర్థం కాలేదు. చివరికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఇలాంటి అనుభవమే మాకు ఎదురైందని చెప్పారు. అయితే దాసరపల్లి ప్రాంతంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మాకు భయం భయంగా ఉంది. గతంలో ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చిన దాఖలాలు లేవు. కరువు కాటకాలు చవిచూశాంగాని.. ఇలాంటి పరిస్థితులు మాకెప్పుడూ ఎదురు కాలేదు. ఇంట్లో పిల్లలు భయం భయంగా ఉన్నారు. పెద్దవాళ్లయితే విచారంతో కనిపిస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని” కౌకుంట్ల గ్రామానికి చెందిన బీరప్ప వ్యాఖ్యానిస్తున్నాడు. అయితే భూమి పొరల్లో కదలికల వల్ల ఇలాంటి మార్పులు సహజమని.. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఇటీవల గోదావరి బెల్టులో చోటు చేసుకున్న భూకంపం.. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పడిన భూకంపానికి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో తాము పరిశోధన చేస్తున్నామని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.