HomeతెలంగాణNandamuri Suhasini: కోడలిని కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్న చంద్రబాబు

Nandamuri Suhasini: కోడలిని కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్న చంద్రబాబు

Nandamuri Suhasini: నందమూరి సుహాసిని కాంగ్రెస్ లో చేరతారా? తనంతట తాను నిర్ణయం తీసుకున్నారా? లేకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారా? లేక చంద్రబాబు మంత్రాంగం నడిపారా? తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే నందమూరి సుహాసిని కాంగ్రెస్ లోకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎంతో కొంత చరిష్మ ఉన్న నేతల్లో నందమూరి సుహాసిని ఒకరు. పార్టీ నుంచి ఎంతోమంది నేతలు వెళ్ళిపోతున్న సుహాసిని మాత్రం కొనసాగుతూ వచ్చారు. ఇటు చంద్రబాబుతో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఆమె ఉన్నట్టుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది.తెలంగాణలో వీలైనంత ఎక్కువ పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది.17 పార్లమెంట్ స్థానాలకు గాను 15 చోట్ల గెలుపొందాలని వ్యూహరచన చేస్తోంది. అందుకే పెద్ద ఎత్తున చేరికలకు ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగానే నందమూరి సుహాసిని కి కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఖమ్మం రాజకీయాల్లో ఆమెను ప్రయోగించాలని చూస్తోంది.అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆమెను పిలిపించుకున్నట్లు సమాచారం.అయితే ఆమె చంద్రబాబు అనుమతి లేకుండా అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు.ప్రత్యేక పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆమెను పిలిపించుకున్నారంటే తెర వెనుక చంద్రబాబు తప్పకుండా ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఖమ్మంలోకాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం సునాయాసమే. అందుకే ఆ సీటుకు విపరీతమైన గిరాకీ. ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ఉన్నారు. లోక్ సభ సీటు తమ వారికే ఇవ్వాలని ముగ్గురు నేతలు పట్టుబడుతున్నారు. భట్టి భార్యకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పొంగులేటి తన సోదరుడు కోసం ప్రయత్నిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగతా ఇద్దరూ తప్పకుండా అసంతృప్తికి గురవుతారు. అందుకే రేవంత్ రెడ్డి ఖమ్మం విషయంలో కొత్త ఆలోచన చేశారు. ప్రియాంక గాంధీని పోటీ చేయాలని కోరారు. కానీ ఆమె ఉత్తరాది రాష్ట్రాల్లోనే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. దీంతో స్థానిక నాయకత్వానికి టిక్కెట్ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అందుకే ఇప్పుడు నందమూరి సుహాసిని తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది.

ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం అధికం.సరిహద్దు జిల్లా కావడంతో తెలుగుదేశం అభిమానులు ఎక్కువగా ఉంటారు. అందుకే తెలంగాణ విభజన తరువాత కూడా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకుంటూ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ లేకపోవడంతో.. ఆ పార్టీకి చెందిన ఓట్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయ్యాయి. అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి విజయం దక్కింది. అయితే ఇప్పుడు టిక్కెట్ ఆశావాహులు అధికం కావడంతో నందమూరి సుహాసిని తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు సూచనను రేవంత్ తప్పకుండా పాటిస్తారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అనుమతి తీసుకునే నందమూరి సుహాసిని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే కోడలు ద్వారా తెలంగాణలో టిడిపిని బతికించే ఏర్పాట్లు జరుగుతుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version