KCR Districts Tour: అయ్యో రామా.. కేసీఆర్ ను సాగనంపడానికి ఎవరూ లేరే?

కేసీఆర్ చేసిన ఆరోపణ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. " మీరు గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 31, 2024 3:33 pm

KCR Districts Tour

Follow us on

KCR Districts Tour: ప్రభుత్వం విధిస్తున్న కరెంటు కోతలను నిరసిస్తూ.. ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా లోని దేవరుప్పల మండలంలోని ఒక గ్రామం లో ఎండిపోయిన పంట చేలను పరిశీలించేందుకు వెళ్లారు. సుమారు వంద కార్ల కాన్వాయ్ తో ఆయన ప్రత్యేకమైన బస్సులో ఆ ప్రాంతానికి వెళ్లారు. కొంతమంది రైతులను ఆయన పరామర్శించారు. ఎండిపోయిన వరిచేలను చూసి బాధపడ్డారు. “ప్రభుత్వానికి బుద్ధి లేదు.. కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదు. నీరును కూడా అందించడం లేదు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాం. అందులో చిన్న చిన్న లోపాలను భూతద్దాలు పెట్టి చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. రాజకీయంగా ఏమైనా చేయాలనుకుంటే మమ్మల్ని చేయండి. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. రైతు ఏడిస్తే రాజ్యానికి సుభిక్షంగా ఉండదని” కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ చేసిన ఆరోపణ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. ” మీరు గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అన్నారం బ్యారేజ్ ఇసుక మేటలు వేసింది. తెచ్చిన మోటార్లలో కొన్ని మాత్రమే పని చేస్తున్నాయి. గోదావరిలో ఆశించినంత స్థాయిలో ప్రవాహం లేదు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి గట్టిగా మూడు నెలలు కూడా కాలేదు. ఈ మూడు నెలల్లోనే తెలంగాణ ఎండిపోయిందా? మీరు సృష్టించిన కోటి ఎకరాల మాగాణం వట్టిపోయిందా? పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారు.. ఇది సమంజసం కాదు.. రైతులకు రుణమాఫీ చేయకుండా, పంటలు ఎండిపోతే పట్టించుకోకుండా, మిల్లర్లు దోచుకుంటే వినిపించుకోకుండా చేసింది మీరు. ఇవాళ రైతులను ఉద్ధరిస్తామని వచ్చారు. కానీ వాస్తవాలు రైతులకు తెలుసని” కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు.

దేవరుప్పులకు వెళ్లే ముందు కేసీఆర్ తన అధికారిక నివాసం నుంచి బయలుదేరారు. భారీ కాన్వాయ్ తో వెళ్లిపోయారు. ముందు వాహనాలు వెళుతుంటే ఆయన ప్రత్యేకమైన బస్సులో ప్రయాణ సాగించారు. ఏదైనా ప్రాంతానికి వెళ్లే ముందు కెసిఆర్ దట్టి కట్టుకుంటారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి హోం శాఖ మంత్రి మహమూద్ అలీ దట్టికట్టేవారు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మహమూద్ అలీ దట్టి కట్టడం లేదు. ఆయన కేసీఆర్ అధికారిక నివాసంలో కనిపించడం కూడా మానేశారని తెలుస్తోంది. ఈ సమయంలో ఎవరో భారత రాష్ట్రపతి నాయకుడు కేసీఆర్ కు దట్టి కట్టారు. ” అయ్యో అధికారం పోయిన తర్వాత కేసీఆర్ కు దట్టి కట్టేవారు కూడా లేకుండా పోయారని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.