Nandamuri Suhasini: నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో సైతం ప్రత్యేక స్థానం. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులను చేర్చుకోవడానికి జాతీయ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. గతంలో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని కాంగ్రెస్లో చేర్పించడంలో రాజశేఖర్ రెడ్డి యాక్టివ్ పాత్ర పోషించారు. ఎన్టీఆర్ కుమార్తె అన్న బ్రాండ్ తో ఆమె ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రి పదవి పొందారు. బిజెపిలో చేరి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆమె బాటలో నందమూరి కుటుంబానికి చెందిన మరో మహిళ నడవనున్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
సుహాసిని తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల్లో కూకట్పల్లి స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 70 వేలకు పైగా ఓట్లు సాధించారు.ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఆమె తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు.చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి.ఒకానొక దశలో ఆమెను ఏపీ నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది.కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను.. 15 స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటన తర్వాత కూడా పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆసక్తి చూపిస్తున్న నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కండువాలు కప్పుతున్నారు. అందులో భాగంగా నందమూరి సుహాసిని కి సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. అందుకే ఆమె సీఎం ఇంటికి వెళ్లి కలిశారు.
గ్రేటర్ హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఆదరణ ఉంది. నాయకులు లేకపోయినా ఓటర్లు ఉన్నారు.కమ్మ సామాజిక వర్గం కూడా అధికం.ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యురాలిగా సుహాసినిని గ్రేటర్ ఎన్నికల్లో రంగంలోకి దించితే సత్ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అందులో భాగంగానే నందమూరి సుహాసిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరి సుహాసిని నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఆమె కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారు అన్నది తెలియాల్సి ఉంది.