Khammam: బీఆర్ఎస్ అనుకూల మీడియా సర్వే.. ఖమ్మం ఎంపీ ఎవరంటే?

నమస్తే తెలంగాణ ఉద్యోగులు కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వరావుపేట నియోజకవర్గాలలో పట్టణాలను, మండలాలను గ్రామాలను, వీధులను జల్లెడ పడుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 31, 2024 10:44 am
Follow us on

Khammam: ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. పురపాలకాలు ఒక్కొక్కటి కారు నుంచి విడిపోతున్న తర్వాత.. గులాబీ పార్టీకి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కేటీఆర్, హరీష్ రావు లాంటివాళ్ళు సుడిగాలి లాగా పర్యటనలు చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కేటీఆర్ లాంటి నాయకులు ఆటోలో ప్రయాణిస్తున్నారు గాని.. అసలు జనం నాడి ఏమిటో కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి.. ప్రశాంత్ కిషోర్ ను ఎంగేజ్ చేసుకునేంత ఆర్థిక సంపత్తి లేదు. ప్రశాంత్ కిషోర్ తో ఉన్న రిలేషన్ ఇటీవలే చెడిపోయింది. ఇక మిగతా సర్వే సంస్థలు పెద్దగా భారత రాష్ట్ర సమితి దేకడం లేదు. సో ఎటు చూసుకున్నా పరిస్థితి బాగోలేదు. ఈ క్రమంలో సర్వే చేసేందుకు వాళ్లు, వీళ్లు ఎందుకనుకున్నారో ఏమో తెలియదు గానీ.. మొత్తానికి బీఆర్ఎస్ అనుకూల మీడియాలో పనిచేసే ఉపసంపాదకులను, కొంతమంది ఉద్యోగులను సర్వే లో పాల్గొనాలని సూచించారని ఒక సర్వే నోట్ బయటకు వచ్చింది. ఇందుకు ఒక ఫార్మాట్ కూడా రూపొందించారు. సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్, అతడు చేస్తున్న పని, సర్వే చేసిన పార్లమెంటు నియోజకవర్గం, అసెంబ్లీ స్థానం, రెస్పాండెంట్ పేరు.. ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఎందుకు? ఈ అంశాలతో సర్వే చేయాలని భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం తన అనుకూల మీడియా ఉద్యోగులకు సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది..

అలా బీఆర్ఎస్ అనుకూల మీడియా ఉద్యోగులు కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వరావుపేట నియోజకవర్గాలలో పట్టణాలను, మండలాలను గ్రామాలను, వీధులను జల్లెడ పడుతున్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? అని వారికి ఎదురైన వారిని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ పార్టీ అని కొందరు, బిజెపి అని మరికొందరు, భారత రాష్ట్ర సమితి అని ఇంకొందరు అంటున్నారు. బిజెపి ఎందుకు గెలవాలి అని అడిగితే.. “రామ జన్మభూమిలో రామాలయం నిర్మించారు, రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట చేశారు. అన్నింటికీ మించి దేశ అంతర్గత భద్రతను పెంచారు” అని ఓటర్లు వివరించారు. ఇక భారత రాష్ట్ర సమితి ఎందుకు గెలవాలి అని అడిగితే..” ఈ ప్రాంత ఎంపీ నామ నాగేశ్వరరావు మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ ద్వారా చెరుకు రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. అందరికీ అండగా ఉంటున్నారు” అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలి అని అడిగితే..” పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. సమస్యలు పరిష్కారం కావాలి, ఇతర పథకాలు అందాలంటే.. ఆ పార్టీ గెలవాలి అని” ఓటర్లు పేర్కొన్నారు.

అయితే ఈ సర్వేలో మొత్తం శాంపిల్ 100 మందిని తీసుకుంటే.. అందులో బిజెపి వైపు 36 మంది, కాంగ్రెస్ వైపు 34 మంది, భారత రాష్ట్ర సమితి వైపు 30 మంది ఆసక్తి చూపించారు. మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తొమ్మిది స్థానాలు గెలుచుకుంది. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం, మధిర, పాలేరు ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు సర్వేలో ప్రజలు కొంత బిజెపి వైపు, కొంత భారత రాష్ట్ర సమితి వైపు మొగ్గు చూపడం విశేషం.. ఈ పార్లమెంట్ స్థానంలో సోనియా గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇంకా అది వ్యాపించలేదు. బిజెపి నుంచి వినోద్ రావు అనే వ్యాపారవేత్త పోటీ చేస్తున్న నేపథ్యంలో.. చాలామంది ఆయన వైపు మొగ్గు చూపించారు. ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు, భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో చాలామంది ఆయన బిజెపి ఎంపీగా గెలిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వెలిబుచ్చారట. ఇక భారత రాష్ట్ర సమితి నుంచి నామ నాగేశ్వరరావు పోటీ చేయడం లాంచనమే అయినప్పటికీ.. కీలకమైన కేడర్ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన ఒకింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో భారత రాష్ట్ర సమితి గెలిచే పరిస్థితి లేదని నమస్తే సర్వే ద్వారా తేటతెల్లమవుతున్నది.