BRS : ఇది కేసీఆర్ షాకింగ్ లాంటి వార్త. అధికారంలోకి రావాలని కలలుగంటున్న కాంగ్రెస్‌కు బూస్టింగ్ లాంటి వార్త. జెండా ఎగరేస్తామని చెబుతున్న బీజేపీకి ఎదుగూబొదుగు లేని వార్త. ఇంతకీ విషయం ఏంటయ్యా అంటే.. ఇండియా టుడే తెలుసు కదా! దేశంలోని పెద్ద మీడియా హౌస్‌లలో అదీ ఒకటి. అయితే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది? ఎవరు అధికారంలోకి వస్తే ప్రయోజనం అని భావిస్తున్నారు? ఇలా పలు రకాల ప్రశ్నలు అడిగింది. వారు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ వాసులు చెప్పిన సమాధానాలను మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట వెలువరించింది.
ఇండియా టుడే సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ కాలర్ ఎగరేసేలా ఫలితాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని కోరితే.. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భారీగానే ఆశావహులు ఉన్నారు. ఇండియా టుడే సర్వే ప్రకారం కాంగ్రెస్ ఈసారి ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. బహుశా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నందు వల్లే ఈ మార్పు వచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక కర్ణాటక ఫలితం కూడా తెలంగాణలో కాంగ్రెస్ అనుకూల పరిస్థితులు ఏర్పడేందుకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాటిని ప్రతిబింబించే విధంగా ఇండియా టుడే సర్వే ఉండటం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 19 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిలో రెండు స్థానాల్లో కచ్చితంగా ఎంఐఎం గెలుస్తుందని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. ఇక మిగతా స్థానాల్లో కాంగ్రెస్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి ఆ సంఖ్య ఏడుకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి ఆ సంఖ్య ఆరుకు పడిపోయే ప్రమాదముందని తేల్చేసింది. ఇక ఎన్డీఏ సాధించే సీట్లల్లో పెద్దగా మార్పు ఉండదని ఇండియా టుడే చెప్పేసేంది. అంటే ఈ సర్వే ఎలా చేసింది? దీనికి పారదర్శకత ఏమిటి? అనేది పక్కన పెడితే బీఆర్‌ఎస్‌కు ఒకింత పాజిటివ్ వాయిస్‌గా ఉండే ఇండియా టుడే ఇలాండి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇచ్చిందీ అంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు లెక్క.