Motkupalli Anger Ponnam Prabhakar: కాంగ్రెస్ అంటేనే కయ్యాల పార్టీ.. ఒకరి ఎదుగుదలను ఇంకొకరు ఓర్వరు. ఎదిగినవాడిని కిందకు లాగుదామని చూస్తూ ఉంటారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీలో అంతర్గత గొడవలు మాత్రం ఆగడం లేదు. మంత్రి పదవి రాని నేతలంతా ఇప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డిపై గుస్సాగా ఉన్నారు. ఇక మంత్రి పదవి వచ్చిన వారు అధికారం ఉందని విర్రవీగుతున్నారు. తాజాగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదం రేపాయి. దళిత నాయకుడు అయిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మంత్రి పొన్న ప్రభాకర్ దున్నపోతు అని వ్యాఖ్యానించినట్లు మరో మాజీ మంత్రి, దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆ వ్యాఖ్యను మాదిగలపై చిన్నచూపుకు నిదర్శనమని పేర్కొన్నారు.
దళిత వర్గంలో అసంతృప్తి
జాతి ఆధారంగా లేదా వ్యక్తిత్వాన్ని అవమానించేలా మాట్లాడటం, ప్రత్యేకించి దళిత నాయకులపై, రాజకీయంగా, సామాజికంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ ఘటన వల్ల దళిత వర్గంలో కాంగ్రెస్ నాయకత్వంపై అభిప్రాయ భేదాలు మరింత పెరిగే అవకాశముంది. లక్ష్మణ్‌పై వచ్చిన వ్యాఖ్య అతన్ని వ్యక్తిగతంగా మాత్రమే కాక, అతని కమ్యూనిటీని కూడా బాధపెట్టింది.
సంఘటన నేపథ్యం..
మోత్కుపల్లి తెలిపిన వివరాల ప్రకారం..లక్ష్మణ్ ప్రెస్ మీట్‌ను సాయంత్రం 3:30 గంటలకు నిర్వహించేందుకు నిర్ణయించగా, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి అరగంట ముందే 3 గంటలకు కార్యక్రమానికి హాజరయ్యారు. లక్ష్మణ్ అక్కడ లేకపోవడం వివాదానికి కారణమైంది. ఈ సందర్భంలోనే అవమానకర పదజాలం వినిపించిందని అంటున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఈ ఘటనను బహిరంగంగా ప్రస్తావిస్తూ, ‘‘మీరు నిజంగా ఆ మాట అన్నారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలి’’ అని పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించారు. ఆయన ప్రకారం, లక్ష్మణ్ తన ముందు గంటపాటు భావోద్వేగంతో బాధపడ్డాడని వెల్లడించారు.
రాజకీయ ప్రభావం..
ఇప్పటికే వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ. డీసీసీ అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పడడం లేదు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మధ్య తాజా వివాదం రాజకీయంగా కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దాని ఫలితం పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉంది. పార్టీపై దళిత వర్గం విశ్వాసం దెబ్బతినక ముందే, నాయకత్వం ఈ విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మొత్తానికి, ఒక అనవసరమైన పదజాలం రాజకీయ సంబంధాలను, సామాజిక సున్నితతలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేయగలదో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది.
పొన్నం ప్రభాకర్ దున్నపోతు అన్నందుకు అడ్లురి లక్ష్మణ్ నాముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు
దళిత బిడ్డను పట్టుకొని దున్నపోతు అనడం చాలా బాధాకరం
పొన్నం ప్రభాకర్‌కు దళితులు అంటే అంత చులకన భావం ఉండటం అనేది కరెక్ట్ కాదు
అడ్లూరి లక్ష్మణ్‌ను దున్నపోతు అని అనే అంత అవసరం ఏం వచ్చింది
3:30… pic.twitter.com/0Js45SG6PC
— Telugu Scribe (@TeluguScribe) October 6, 2025