MLC Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాల నేతలు కీలక పాత్ర పోషించారు. ఇందులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసింది. పది రోజుల కస్టడీ అనంతరం తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తిహార్ జైలులోనే ఉన్నారు.
ఆప్ ఎంపీకి బెయిల్..
ఇదిలా ఉండగా ఇదే కేసులో ఆరు నెలల క్రితం అరెస్ట్ అయిన ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు సుప్రీం కోర్టు ఏప్రిల్ 2న బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ ఈ బెయిల్ ఉంటుంది. అయితే బెయిల్ రావడానికి ప్రధాన కారణం ఆయన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడమే. తన రాజకీయ అవసరాలను దెబ్బకొట్టేందుకు, ఎన్నికల్లో పోటీ, ప్రచారం చేయకుండా ఉండేందుకు తనను కేసులో ఇరికించారని సంజయ్‌సింగ్ సుప్రీకోర్టులో వాదించారు. ఇదే సమయంలో సంజయ్‌సింగ్‌కు డబ్బు ఎలా చేరిందో ఈడీ ఆధారాలు చూపలేదు. దీంతో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కవిత పోటీ చేసిఉంటే..
సంజయ్‌సింగ్‌కు బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత బెయిల్ అంశం తెరపైకి వచ్చింది. ఆమె ట్రయల్ కోరుట్లో బెయిల్ పిటిషన్ వేశారు. తన కొడుకుకు పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ ఈడీ బెయిల్‌ను వ్యతిరేకించడంతో విచారణ వాయిదాపడింది. కవిత కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. సంజయ్ సింగ్ తరహాలో బెయిల్ మంజూరయ్యేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సంజయ్‌సింగ్ సిట్టింగ్ ఎంపీ అయినందున బెయిల్ మంజూరైందని కొందరు అంటున్నారు. అయితే కవిత సిట్టింగ్ ఎంపీ కానప్పటికీ.. బీఆర్‌ఎస్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ అవకాశాలను దెబ్బతీయాల్సిన అవసరం లేదు. ఈమేరకు కోర్టుకు విన్నవించే అవకాశం ఉంటుంది.
బెయిల్ ఇవ్వొద్దంటున్న ఈడీ..
ఇదిలా ఉండగా ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని గట్టిగా వాదిస్తోంది. కానీ, సంజయ్ సింగ్‌కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవితకు కొంత అవకాశాలు ఉండేవన్న చర్చ జరుగుతోంది. అయితే కవిత ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె రాజకీయ కారణాలతో బెయిల్ కోరకపోవచ్చని తెలుస్తోంది. కవిత ఆధ్యాత్మిక బాటలో జపమాల, ఆధ్యాత్మిక పుస్తకాలు, మెడిటేషన్ చేస్తున్నారని తెలుస్తోంది. జైల్లో చదువుకోవటానికి ఇతరత్రా పుస్తకాలను కూడా అడిగారు. అందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది.