Jaishankar: మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలయినప్పటికీ పాకిస్తాన్ కాశ్మీర్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. రక్తపుటేరులు పారిస్తూనే ఉంది.. బిజెపి ప్రభుత్వం రాకమందు వరకు కాశ్మీర్లోని లాల్ చౌక్ ప్రాంతంలో భారతీయ జెండాను కూడా ఎగరవేసేవారు కాదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ సమస్యను పూర్తిగా పరిష్కరించారని కాదు గాని.. గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగైన విధానాలే అవలంబించారని చెప్పక తప్పదు. ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.. అధునాతనమైన సొరంగాలు నిర్మించడం.. వంటి వాటి ద్వారా కాశ్మీర్లో బిజెపి ప్రభుత్వం సరికొత్త అభివృద్ధి చరిత్రను లిఖించింది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో.. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తేనె తుట్టెను కదిపారు. “పాకిస్తాన్, చైనా దేశాలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వీటన్నింటికి కారణం భారతదేశ తొలి ప్రధాని నెహ్రూనే. ఆయన చేసిన కొన్ని తప్పిదాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, చైనా రూపంలో మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయని” జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ” అప్పట్లో ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం పై చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయంలో నెహ్రూ భారతదేశాన్ని కాదని చైనాకు ప్రాధాన్యమిచ్చారు. ముందుగా చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చిన తర్వాత భారతదేశానికి ఇవ్వాలని నాడు నెహ్రూ అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశానికే తొలి ప్రాధాన్యమిస్తుందని ” జై శంకర్ నాటి చరిత్రను తవ్వే ప్రయత్నం చేశారు.
“భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నెలలోనే నాటి హోంశాఖ మంత్రి చైనా నుంచి భారతదేశానికి ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో చైనా, పాక్ ఆత్రంతా కాశ్మీర్ నుంచి తీవ్రమైన సమస్యలను భారత్ ఎదుర్కొంటుందని అప్పుడే చెప్పారు. చైనా తీరుతో ఎప్పటికైనా ప్రమాదమే అని హెచ్చరికలు జారీ చేస్తే.. నెహ్రూ పట్టించుకోలేదు. హిమాలయాల అవతల నుంచి భారత్ పై దాడి చేయడం అత్యంత కష్టమని ఎద్దేవా చేశారు. అలాగే కాశ్మీర్ విషయాన్ని ఐక్య సమితి ముందుకు తీసుకువెళ్లడం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఇష్టం లేదు.. ఇలాంటి పొరపాట్ల వల్లే మన దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో కొందరు సరిహద్దుల గురించి చర్చలు చేస్తున్నారు. వాటి గురించి తిరగరాయాలను చెబుతున్నారు. కానీ ఇక్కడ వారు విస్మరిస్తున్న విషయం ఒకటి ఉంది.. భారతదేశానికి సంబంధించి సరిహద్దులు ఎప్పుడో నిర్ణయించాం. దీని గురించి ఇక చర్చ అనవసరం. దేశం గురించి ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు. భారతీయ జనతా పార్టీ దేశం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. 2014లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు వారసత్వంగా వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో 40 ఏళ్ల తర్వాత భారతదేశానికి జెట్ ఇంజన్ టెక్నాలజీ అందించేందుకు అమెరికా అంగీకరించింది.. సెమీ కండక్టర్ చిప్ లు తయారు చేసేందుకు మూడు సంస్థలు భారతదేశంలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇది మా ప్రభుత్వం చేసిన ఘనత. మేము పని చేశాను కాబట్టి ధైర్యంగా చెప్పుకుంటున్నామని” జై శంకర్ కుండబద్దలు కొట్టారు.
ఎన్నికల ముందు జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి చైనాతో, పాకిస్తాన్ తో సరిహద్దు పరంగా భారతదేశ ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ ప్రాంతంలో భద్రతను పర్యవేక్షించేందుకు ప్రతి ఏటా వేలకోట్లు ఖర్చు చేస్తోంది. రక్షణ పరంగా అధునాతన ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఈ ప్రకారం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మన దేశం లక్షల కోట్లల్లోనే ఇందుకు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా ఆ ఈ విషయాన్ని తెరపైకి తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడింది.. వాస్తవానికి నాడు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్ కనుక చొరవ తీసుకొని ఉంటే ప్రస్తుతం పరిస్థితి వేరే విధంగా ఉండేది. నాడు నెహ్రూ చైనా కు వంత పాడటం వల్ల భారతదేశం ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు జై శంకర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.