MLA Kunamneni Sambasiva Rao
MLA Kunamneni Sambasiva Rao : భారతీయ ఐటీ ఉద్యోగులు పని–జీవిత సమతుల్యత కోసం పోరాడుతున్న వేళ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం, మాజీ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి ప్రముఖులు 70–80 గంటల పని వారాలను సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ అసెంబ్లీలో కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఐటీ ఉద్యోగుల సమస్యలను లేవనెత్తి, వారి హక్కుల కోసం గట్టిగా నిలబడ్డారు. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల దుర్భర పరిస్థితులను ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి సర్కార్‌ను పలు ప్రశ్నలతో నిలదీశారు.
Also Read : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: ‘కొండా’ఔట్, రేవంత్ కొత్త టీమ్ రెడీ!
‘‘తెలంగాణలో ఐటీ ఉద్యోగులు ఎంతమంది పని చేస్తున్నారు? వారికి కార్మిక చట్టాలు వర్తిస్తాయా? చాలామంది రోజుకు 10 గంటలు తప్పనిసరిగా పని చేస్తున్నారు. వారికి పదవీ విరమణ వయస్సు, ప్రయోజనాలు ఉన్నాయా?’’ అని కూనంనేని అడిగారు. ఐటీ కంపెనీలు ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కంపెనీలు వారి యవ్వనం, శక్తి, తెలివిని దోచుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. ఫలితంగా, 50 ఏళ్లకే కీళ్ల నొప్పులు, వెన్నునొప్పులతో వద్ధులుగా మారుతున్నారు. తల్లిదండ్రులతో సమయం గడపలేరు, జీవిత భాగస్వామితో సినిమాకు వెళ్లలేరు, పిల్లలతో ఆడుకోలేరు’’ అని ఆయన వివరించారు.
‘‘ఐటీ ఉద్యోగులకు రాత్రి–పగలు తేడా తెలియదు. ఇంటి నుంచి పని పేరుతో వారాంతాలనూ ఆక్రమిస్తున్నారు’’ అని కూనంనేని విమర్శించారు. ఈ దోపిడీని అరికట్టేందుకు కఠిన చట్టాలు, నిబంధనలు అవసరమని డిమాండ్ చేశారు. ‘‘ఐటీ ఉద్యోగులపై నియంత్రణ ఉండాలి. కార్మిక చట్టాలను వర్తింపజేయాలి, వారి సంక్షేమం కోసం కొత్త చట్టాలు తేవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఐటీ ఉద్యోగుల్లో ఆశలను రేకెత్తించాయి.
ఏకైక ఎమ్మెల్యే..
అసెంబ్లీలో ఐటీ ఉద్యోగుల కోసం గళమెత్తిన ఏకైక ఎమ్మెల్యేగా కూనంనేని నిలిచారు. వారి ఆరోగ్యం, కుటుంబ జీవనం, భవిష్యత్తును కాపాడేందుకు ఆయన చేసిన ఈ పోరాటం, ‘‘మీలాంటి ఎమ్మెల్యేలే కావాలి’’ అనే ప్రశంసలను అందుకుంటోంది. ఐటీ రంగంలో సంస్కరణలకు ఈ చర్చ బీజం వేస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
Also Read : తెలంగాణలో మరో ఎన్నికల నగారా… షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 23న పోలింగ్!