Minister Sitakka: మంత్రివర్గం నుంచి సీతక్క ఔట్‌.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలను మంత్రి సీతక్కకు అప్పగించాలని రేవంత్‌ భావిస్తున్నారు. ఈమేరు ఆయన ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదించినట్లు తెలిసింది.

Written By: Raj Shekar, Updated On : May 25, 2024 3:52 pm

Minister Sitakka

Follow us on

Minister Sitakka: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం జరుగబోతోందా.. గాంధీ భవన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయా అంటే అవుననే అంటున్నారు హస్తం నేతలు. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ జరుగనుంది ఆ తర్వాత టీపీసీసీలో కీలక నిర్ణయాల దిశగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ, పాలన పరంగా తనదైన మార్కు చూపుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్‌ పూర్తిగా పాలనకే పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈమేరు కొత్త పీసీసీ చీఫ్‌ నియామకంపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు.

మార్పుపై హైకమాండ్‌ దృష్టి
మరోవైపు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా టీపీసీసీలో మార్పులపై దృష్టిపెట్టింది. రేవంత్‌కు పాలనలో ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వడంతోపాటు పీసీసీ పగ్గాలు మరొకరికి అప్పగించే ఆలోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే మార్చాలని భావించినా.. లోక్‌సభ ఎన్నికల వరకు రేవంత్‌నే కొనసాగించాలని హైకమాండ్‌ నిర్ణయించింది. ఇక లోక్‌సభ ఎన్నికలు కూడా ముగిసిన నేపథ్యంలో పీసీసీ మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీతక్కకు పార్టీ పగ్గాలు..?
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలను మంత్రి సీతక్కకు అప్పగించాలని రేవంత్‌ భావిస్తున్నారు. ఈమేరు ఆయన ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. రేవంత్‌ ప్రతిపాదననే హైకమాండ్‌ ఆమోదిస్తుందని గాంధీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీసీసీ చీఫ్‌ పదవి కోసం సీనియర్‌ నేతలు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కిగౌడ్‌ పోటీ పడుతున్నారు. హైకమాండ్‌ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వీరందరికీ చెక్‌ పెట్టి గిరిజన మహిళను తెరపైకి తెచ్చారు. గిరిజన మహిళకు అప్పించడం ద్వారా సానుకూలత పెరుగుతుందని భావిస్తున్నారు. పోటీ పడుతున్న నేతలు కూడీ సీతక్కకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. కాగా సీతక్క సీఎం రేవంత్‌కు నమ్మిన బంటు. కష్టపడి పనిచేసే నాయకురాలు. దీంతో ఆమెవైపే మొగ్గు చూపినట్లు సమాచారం.

మంత్రి పదవి ఔట్‌..
పీసీసీ పగ్గాలు అప్పగిస్తే మంత్రి పదవికి సీతక్క రాజీనామా చేస్తారని పార్టీలో కొందరు పేర్కొంటున్నారు. మరికొందరు మంత్రిగా కొనసాగుతూనే పార్టీ బాధ్యతలు నిర్వహిస్తారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్‌ నియామకం, తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీ ఉంటాయని తెలుస్తోంది.