Minister Ponnam Prabhakar: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ప్రొటోకాల్‌ వివాదం.. అలిగి బయట కూర్చున్న మంత్రి పొన్నం.. తర్వాత ఏమైందంటే?

కల్యాణోత్సవానికి ఉదయం మంత్రి కొండా సురేఖ వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి వెళ్లిపోయారు. తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్‌ సతీసమేతంగా వచ్చారు. తర్వాత జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా వచ్చారు. వారు అక్కడికి వచ్చిన సమయంలో అధికారులు ఎవరూ అక్కడ కనిపించలేదు. మంత్రి పర్యటన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ ఉండాలి.

Written By: Raj Shekar, Updated On : July 9, 2024 2:41 pm

Minister Ponnam Prabhakar

Follow us on

Minister Ponnam Prabhakar: కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం మంగళవారం(జూలై 9న) కన్నువల పండువగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున వైభవంగా కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

దర్శించుకున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు..
ఇదిలా ఉంటే బల్కం పేట ఎల్లమ్మను ఉదయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు.

ప్రొటోకాల్‌ వివాదం..
కల్యాణోత్సవానికి ఉదయం మంత్రి కొండా సురేఖ వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి వెళ్లిపోయారు. తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్‌ సతీసమేతంగా వచ్చారు. తర్వాత జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా వచ్చారు. వారు అక్కడికి వచ్చిన సమయంలో అధికారులు ఎవరూ అక్కడ కనిపించలేదు. మంత్రి పర్యటన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ ఉండాలి. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో మంత్రి పొన్నం, మేయర్‌ మనస్తాపం చెందారు. అలిగి ఆలయం బయటే కూర్చున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరణ ఇచ్చిన పొన్నం..
ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం అలకపై టీవీ ఛానెళ్లు, సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ కావడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. హుటాహుటిన ఆలయానికి చేరుకుని మంత్రి, మేయర్‌ను ఆలయంలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులను మందలించారు. తర్వాత వారు ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. తాను అలిగినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను క్యూలైన్లను పరిశీలించేందుకు ఆలయం బయట కూర్చున్నట్లు తెలిపారు. రద్దీకారణంగా మేయర్‌ విజయలక్ష్మి, ఓ గర్భిణి కిందపడబోయారని పేర్కొన్నారు. తాను ఎవరిపైనా అలగలేదని వెల్లడించారు. ఏర్పాట్లు సరిగా లేవని అధికారులను మందలించానని తెలిపారు. ఏర్పాట్లు సరిగా లేక ఇబ్బంది పడిన ప్రజలకు క్షమాపణ చెప్పారు.

రేపటితో ముగియనున్న వేడుకలు..
ఇదిలా ఉంటే… బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఉదయం నిర్వహించిన గణపతి పూజతో వేడుకలు మొదలయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం కల్యాణం జరిపించారు. బుధవారం ఉదయం 8 గంటలకు మహాశాంతి చండీహోమం, సాయంత్రం 6 గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగించనున్నారు.

భూమికి 10 అడుగుల దిగువన..
భాగ్యనగరం భక్తుల ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు భూమి ఉపరితలానికి 10 అడుగుల దిగువన నిద్రిస్తున్న రూపంలో స్వయంభువుగా వెలిసినట్లు స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో అమ్మవారి మూల విగ్రహం వెనుక నిత్యం నీటి ఊటలు ఉంటాయి. కాలం ఏదైనా ఈ నీటి ఊటలు వస్తుంటాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, దాదాపు 700 సంవత్సరాలకు క్రితం ఇక్కడ అమ్మవారు వెలిసినట్లు చెబుతారు.