Medaram Jatara: తెంలగాణ కుంభమేళా ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో భాగంగా బుధవారం(ఫిబ్రవరి 21న) పగిడిద్దరాజు, జంపన్నను సాయంత్రం గద్దెలపైకి తీసుకువచ్చారు. సారలమ్మను రాత్రి 10 గంటల తర్వాత కోయ పూజారులు కన్నెపల్లి నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. మరోవైపు జాతర మొదలు కావడంతో మేడారం జనసంద్రమైంది. భారీగా భక్తులు జాతరకు వస్తున్నారు.
నేడు సమ్మక్క రాక..
జాతరలో రెండో రోజు అయిన గురువారం(ఫిబ్రవరి 22న) సమ్మక్కను చిలకల గుట్ట నుంచి కోయ పూజారులు పటిష్ట బందోబస్తు నడుమ గద్దెలపైకి తీసుకువస్తారు. జాతరలో ఇదే అత్యంత ప్రధాన ఘట్టం. సమ్మక రాకతో దేవతలందరూ మనకు గద్దెలపై దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మవార్ల దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారు.
రాష్ట్ర పండుగగా గుర్తింపు..
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు లేదని కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మేడారం జాతరకు గుర్తింపు తీసుకువచ్చారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర రోజు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించేది.
ఈ ఏడాది సెలవు లేనట్టే..
ఇక ఫిబ్రవరి 23న మేడారంలో దేవతలందరూ గద్దెలపై కొలువుదీరి ఉంటారు. ఇప్పటికే జాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. జాతర సందర్భంగా శుక్రవారం సెలవు ఇవ్వాలని ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. రాష్ట్ర పండుగ అయినందున ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ, సెలవుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వినతులు ఇస్తున్నారు. కానీ, ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో శుక్రవారం సెలవు లేనట్టే అని తెలుస్తోంది.
ఆ జిల్లాలో నాలుగు రోజులు
ఇక మేడారం జాతర జగిగే ములుగు జిల్లాలో మాత్రం ప్రభుత్వం నాలుగు రోజులు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో కాలేజీలు, స్కూళ్లకు సెలవు మంజూరు చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఎవరికీ సెలవులు లేవు. వరంగల్ జిల్లాలో రెండు రోజులు(22, 23 తేదీల్లో) స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండు రోజులు సెలవు ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు.