Tirupati history : తిరుమల తిరుపతి దేవస్థానానిది సుదీర్ఘ చరిత్ర. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన ప్రాంతం. శేషాచలంపై శ్రీవారు వెలసిన దివ్యధామం తిరుమల.అటువంటి పుణ్యక్షేత్రం చెంతన వెలసిన ఆధ్యాత్మిక నగరం తిరుపతి. శతాబ్దాల కిందట తిరుపతి ఓ చిన్న గ్రామం. ఎన్నెన్నో పేర్లతో పిలవబడి ఇప్పుడు ఆధ్యాత్మికానికి పుట్టినిల్లుగా మారింది. మానవ జీవన విధానానికి, మనుగడకు, పూర్వీకుల చరిత్రకు నిలువెత్తు సాక్షాలుగా నిలిచే శిలా శాసనాలు తిరుపతి ఘన చరిత్రను మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి.అటువంటి తిరుపతి ఈనెల 24వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటోంది. దాని వెనుక ఉన్న కథను ఒకసారి తెలుసుకుందాం.
తిరుమలలో వెలసిన శ్రీనివాసుని దర్శనానికి లక్షలాదిమంది భక్తులు తిరుమల చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ముందుగా తిరుపతి చేరుకోవాల్సిందే. చిన్న కుగ్రామంగా ఉన్న తిరుపతి అంచలంచెలుగా ఎదిగింది. ఉమ్మడి ఏపీలోనే ఒక మహానగరం గా మారింది. అయితే ఇలా రూపాంతరం చెందే క్రమంలో ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 1130 ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భవించినట్లు చరిత్ర చెబుతోంది. సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్ర సోమవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజుల గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించారని.. నిత్య కైంకర్యములు చేసి.. నాలుగు మాడవీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మించడం మొదలు పెట్టారని చరిత్ర చెబుతోంది. నాటి బీజమే నేటి తిరుపతి నగరం.
ఈ ఆధారం అనుసరించి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి నగరం పుట్టినరోజు వేడుకలు చేసుకుంటోంది. ఈ ఏడాది 24 శనివారం 894వ పుట్టిన రోజును జరుపుకోనుంది. 893 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24న శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారని కూడా చరిత్ర చెబుతోంది. తొలుత పట్టణంగా ఉన్న తిరుపతిని.. గోవిందరాజ పట్టణం అని.. తరువాత రామానుజాపురం అని.. 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతి అని పిలవడం ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈనెల 24న మహానగరం తిరుపతి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.