HomeతెలంగాణKTR: గులాబీనేత ఉలికిపాటు.. ప్రతీ విమర్శకు వివరణ.. కేటీఆర్‌కు ఏమైంది!?

KTR: గులాబీనేత ఉలికిపాటు.. ప్రతీ విమర్శకు వివరణ.. కేటీఆర్‌కు ఏమైంది!?

KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం, విద్యుత్‌ ఒప్పందాలు, ఇతర అవినీతి అంశాలపైనే ఎక్కువగా ఫోక్‌ చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ఇప్పటికే నలుగురు పోలీస్‌ అధికారులను అరెస్టు చేసి విచారణ చేయిస్తోంది. బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన తప్పిదాల కూపీ లాగుతోంది. బీఆర్‌ఎస్‌ కీలక నేతల పేర్లు బయటకు వచ్చే వరకూ వదిలేలా కనిపించడం లేదు.

కీలక నేతలపై ఆరోపణలు..
ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు టార్గెట్‌గానే విమర్శలు చేస్తున్నారు. ఈమేరకు వరుసగా డీజీపీని కలుస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు కేకే.మహేందర్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నేతలు రఘునందన్‌రావు, చీకోటి ప్రవీణ్‌తోపాటు, ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలక నిందితుడు అయిన నందకుమార్‌ కూడా తమ ఫోన్లను బీఆర్‌ఎస్‌ నేతలు ట్యాప్‌ చేశారని ఫిర్యాదు చేశారు. చీకోటి ప్రవీణ్‌ అయితే బాధితులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.

హీరోయిన్ల ఫోన్‌ ట్యాప్‌ చేశారని..
ఇదిలా ఉండగా, కేటీఆర్‌ ఆదేశాలతోనే పోలీసులు రాజకీయ నాయకులు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్‌ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కారణంగానే నాగచైతన్య, సమంత విడిపోయారని ఆరోపించారు. రోజు రోజుకూ కేటీఆర్‌నే కాంగ్రెస్‌ నాయకులు టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో గులాబీ నేత ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొన్న ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేదని, చేస్తే దొంగల ఫోన్లు ట్యాప్‌ చేసి ఉండవచ్చని పేర్కొన్నాడు. తర్వాత తనపై కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా హీరోయిన్‌ను బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని, హీరోయిన్లను బెదిరించాడని ఓ మంత్రి మాట్లాడుతున్నారని అన్నారు. ఇలాంటి ఆరోపణలకు భయపడనని, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని మరోమారు హెచ్చరించారు. ఆరోపణలు చేసేవారిని వదిలిపెట్టనని అన్నారు.

ఏంటీ పరిస్థితి..
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ భయపడని కేటీఆర్‌లో ఇప్పుడు భయం మొదలైనట్లు కనిపిస్తోంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని లీగల్‌ నోటీసులు పంపుతున్నా అధికార పార్టీ నేతల నుంచి ఆరోపణలు ఆగడం లేదు. దీంతో ప్రతీ ఆరోపణకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో కేటీఆర్‌ ఉన్నారు. చట్టపరంగా ఎంతమందిపై చర్య తీసుకుంటారో చూద్దాం అన్నట్లు కాంగ్రెస్‌ నేతలు కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌ టెన్షన్‌ పడుతున్నట్లు గులాబీ భవన్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం చివరకు కేటీఆర్‌ మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular