KTR: తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో రాజకీయ వేడి చల్లారడం లేదు. విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లు, ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం రంజుగా మారుతుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏ విషయంలోనూ వెనక్కు తగ్గడం లేదు. దీంతో ప్రతినిత్యం ఏదో ఒక అంశం తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని విఫల ముఖ్యమంత్రిగా చూపించేందుకు గులాబీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సవాళ్ల రాజకీయం బీఆర్ఎస్ కు ఏమాత్రం సెట్ కావడం లేదు. ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు సవాళ్ళు విసిరి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇటీవల రైతు రుణమాఫీ విషయంలో అత్యుత్సాహంతో సవాల్ విసిరి హరీశ్ రావు అభాసుపాలు కావాల్సి వచ్చింది. తాజాగా కేటీఆర్ సీన్ లోకి ఎంటరై సవాల్ చేసినా గత అనుభవాల దృష్ట్యా ఆయన సవాల్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు.
హరీశ్ బుక్కయ్యాడు..
రెండు రోజుల క్రితం ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తర్వాత నాలుక కరుచుకున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ట్విట్టర్ వేదికగా క్షమాపణ కోరారు. ఇక మరసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ సవాల్ హరీశ్ రావును బుక్ చేసింది.
ఆలస్యమైనా అవుతుంది..
బ్యాంక్ సంబంధిత సమస్యలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇలా ఆగిపోయిన రైతులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..వారికీ రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనినే అస్త్రంగా చేసుకొని కేటీఆర్ సవాల్ విసిరారు. కాగా, రైతులందరికీ రుణమాఫీ చేసే విషయంలో రేవంత్ పట్టుదలగా ఉండటంతో ఆలస్యమైనా రుణమాఫీ జరిగి తీరుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. కానీ, సంపూర్ణ రుణమాఫీ జరిగితే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసరడం… ఆ పార్టీ సవాల్ విసిరి తోకముడిచిన సందర్భాలను తెరమీదకు తీసుకొచ్చినట్లయింది.
గులాబీ నేతల సవాళ్లు..
గతంలో హరీశ్ రావు టీడీపీ.. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇస్తే ఆ పార్టీ కార్యాలయంలో అటెండర్ గా పని చేస్తానని సవాల్ విసిరారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చింది. హరీశ్ సవాల్ కు కట్టుబడింది లేదు.
– ఇప్పుడు కూడా రుణమాఫీ విషయంలో హరీశ్ సవాల్ విసిరి వెనక్కి తగ్గారు.
– గతంలో కేసిఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను అందరు వినడం చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కానీ టిఆర్ఎస్ విలీనం జరగలేదు.
– తెలంగాణ వచ్చాక జరిగిన ఎన్నికల్లో దళితుడిని రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి చేస్తానని కేసిఆర్ సవాల్ చేశారు. గెలిచిన తర్వాత తాను గద్దెనెక్కి కూర్చున్నారు.
– తెలంగాణ వస్తే ఇంటికి ఉద్యోగం ఖాయమని ప్రకటించారు. తర్వాత అలా అనలేదని మాట మార్చారు.
– దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మాట మార్చారు.
– ఇప్పుడేమో కేటీఆర్ సంపూర్ణంగా రుణమాఫీ జరిగినట్లు తేలితే రాజీనామాకు సిద్దమని ప్రకటిస్తుండటంతో ఆ పార్టీ ఛాలెంజ్ పాలిటిక్స్ తెలిసిన వారంతా దీనిని లైట్ తీసుకుంటున్నారు.