https://oktelugu.com/

KTR: ప్రజలు ఇచ్చిన కొత్త పాత్రను మీ ఎమ్మెల్యేలు కోరుకోవడం లేదు కేటీఆర్ సార్?

కేసీఆర్ నల్లగొండలో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. కరీంనగర్ లోనూ అదే తీరుగా మాట్లాడారు. ప్రభుత్వం కూలిపోతుందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 13, 2024 / 08:30 AM IST

    KTR

    Follow us on

    KTR: “ఉద్యమ పార్టీగా మా ప్రస్థానం మొదలైంది. వాస్తవానికి తెలంగాణ వస్తే మేం చాలనుకున్నాం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మా పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ అదృష్టవశాత్తు మేము ఆ పార్టీలో విలీనం కాలేదు. అది తెలంగాణ ప్రజల అదృష్టం కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తామని కలలో కూడా ఊహించలేదు. ప్రజలు మాకు మెజారిటీ ఇచ్చారు. రెండోసారి కూడా అధికారం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు సర్వదా, శతదా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాం. అలాగని ప్రజలు మమ్మల్ని చిన్నచూపు చూడలేదు. 39 సీట్లు ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా ఉండాలని కోరారు. కొత్త పాత్ర మాకు ఇచ్చారు. ఆ పాత్రను మేము పూర్తిగా నిర్వర్తిస్తాం”. ఇవీ భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. శుక్రవారం రాత్రి తో ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో ఆయన పలు కీలక విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.

    కేటీఆర్ కొత్త పాత్ర గురించి గొప్పగానే చెప్పారు గానీ.. ఆ కొత్త పాత్రలో ఇమిడిపోయేందుకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కండువా కనుక్కున్నారు..”ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు” అనే మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే..”ఓడిపోయే పార్టీలో ఎందుకు ఉండాలి? రాజకీయ జీవితాన్ని ఎందుకు ఫణంగా పెట్టాలి” అని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే.. వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఆమెకు భారత రాష్ట్ర సమితి కేటాయించింది. కానీ ఆ అనూహ్యంగా ఆమె ఆ పార్టీ నుంచి పోటీ చేయబోనని ప్రకటించింది. ‘ ఢిల్లీ మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్.. ఇక చాలా విషయాలు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని.. అందువల్ల తాను పోటీ చేయబోనని” కెసిఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించింది. సహజంగానే కడియం కావ్య ఉదంతం భారత రాష్ట్ర సమితిలో కుదుపునకు కారణమైంది. ఆమె తర్వాత ఓ పార్లమెంటు స్థానానికి సంబంధించిన అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.. ఇప్పటికే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాష్ట్ర సమితిలో ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి.. అలాంటప్పుడు కేటీఆర్.. కొత్త పాత్ర ఇచ్చారు, అది మేము పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తామని చెప్పడం విశేషం.

    ఆ మధ్య కేసీఆర్ నల్లగొండలో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. కరీంనగర్ లోనూ అదే తీరుగా మాట్లాడారు. ప్రభుత్వం కూలిపోతుందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అంతే.. రేవంత్ రెడ్డి గేట్లు తెరిచారు. దీంతో పోలోమంటూ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం మొదలుపెట్టారు. కెసిఆర్ కు ఆత్మ లాగా ఉన్న కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. వారంతా అవకాశవాదులు అని కేటీఆర్ చెప్తున్నారు.. అలాంటప్పుడు అవకాశవాదులకు పదవులు ఇచ్చింది ఎవరు? మిగతా వారిని దూరం పెట్టింది ఎవరు? ఇప్పుడు అవకాశవాదులు వెళ్లిపోతుంటే.. ప్రజలు ఇచ్చిన కొత్త పాత్రను పోషించాల్సింది ఎవరు? ఏ రాజకీయ పార్టీ అయినా ఇలానే వ్యవహరిస్తుందని కొంతమంది చెబుతుండొచ్చు. కానీ భారత రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ కదా.. అలాంటప్పుడు ఉద్యమంలో ఉన్నవారికి సింహభాగం దక్కాలి కదా. గత పది సంవత్సరాలలో వారికి ఎలాంటి ప్రయోజనం దక్కింది? ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరిగింది? ఈ ప్రశ్నలను ఆ ప్రైవేట్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ సంధిస్తే.. వాటికి కేటీఆర్ సమాధానం చెప్పలేకపోయారు.. డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు కానీ.. ప్రజలకు అప్పటికే అర్థమైంది. సరే రాజకీయ నాయకులు అన్నాకా.. అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు.. కానీ మెజార్టీ వర్గాన్ని దూరం చేసుకోవద్దు కదా.. అలా దూరం చేసుకున్నందుకే భారత రాష్ట్ర సమితి అధికారానికి దూరమైంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ లాంటి వాళ్ళు బయటికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా.. ఎన్ని కొత్త పాత్రల గురించి వివరించినా నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు.