LSG Vs DC IPL 2024: అక్కడే మలుపు తిరిగింది.. ఢిల్లీ గెలుపునకు కారణమైంది..

లక్నో జట్టు లో ఈమధ్య మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న క్వింటన్ ఈ మ్యాచ్ లో 19 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి లక్నో జట్టు 28 రన్స్ స్కోర్ చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 13, 2024 8:39 am

LSG Vs DC IPL 2024

Follow us on

LSG Vs DC IPL 2024: ఆడుతోంది లక్నోలో. బ్యాటింగ్ చేస్తోంది లక్నో జట్టు.. ఇప్పటికే ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. బ్యాటింగ్ పరంగా ఆ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. సో.. ఏ ప్రకారం చూసుకున్నా ఢిల్లీకి మరో ఓటమి తప్పదని అందరూ ఒక అంచనాకు వచ్చారు. చివరికి గూగుల్ ప్రిడిక్షన్ కూడా అదే చెప్పింది. కానీ మైదానంలోకి దిగడమే ఆలస్యం.. ఈసారి ఢిల్లీ అసలు సిసలైన తన బౌలింగ్ పరాక్రమాన్ని చూపించింది. ఎంతలా అంటే బలమైన లక్నో జట్టు 100 లోపే 7 వికెట్లు కోల్పోయేంతలా … కులదీప్ తిప్పే మెలికలకు లక్నో జట్టులో కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని, అర్షద్ ఖాన్ మినహా మిగతా వారంతా వచ్చినదారి వెంట వెళ్లిపోయారు.

లక్నో జట్టు లో ఈమధ్య మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న క్వింటన్ ఈ మ్యాచ్ లో 19 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి లక్నో జట్టు 28 రన్స్ స్కోర్ చేసింది. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ కేవలం మూడు పరుగులు చేసే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. ప్రమాదకరమైన మార్కస్ స్టోయినీస్ 8 పరుగులకే కులదీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్ గోల్డెన్ డక్ గా కులదీప్ యాదవ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీపక్ హుడా ఇషాంత్ శర్మ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడుతున్నప్పటికీ.. అతడికి మరో ఎండ్ లో సహకారం లభించలేదు. 22 బంతుల్లో 39 పరుగులు చేసిన అతడు కులదీప్ యాదవ్ బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికే లక్నో ఆరు వికెట్లు కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కృణాల్ పాండ్యా కూడా మూడు పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

94 పరుగులకే ఏడు కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. ఆయుష్ బదోని, అర్షద్ ఖాన్ 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. బదోని 35 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్ సహాయంతో 55 పరుగులు చేశాడు. అర్షద్ ఖాన్ 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు.. అప్పటివరకు లక్నో జట్టు ఆటగాళ్లను వెంట వెంటనే అవుట్ చేసిన ఢిల్లీ బౌలర్లు.. వీరిని మాత్రం కట్టడి చేయలేకపోయారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఎంతమంది బౌలర్లను ప్రయోగించినప్పటికీ వీరి జోడిని విడదీయలేకపోయారు. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో లక్నో జట్టు 7 వికెట్ల కోల్పోయి 167 పరుగులు చేసింది.

ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు.. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా బౌలర్లు కులదీప్ యాదవ్ 3/20, ఈశాంత్ శర్మ 1/36, ఖలీల్ అహ్మద్ 2/41, ముఖేష్ కుమార్ 1/41 సత్తా చాటడంతో లక్నో బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డారు. 7 వికెట్లకు లక్నో జట్టు 94 పరుగులు చేస్తే.. అర్షద్ ఖాన్, బదోని జోడి ఎనిమిదో వికెట్ కు ఏకంగా 73 పరుగులు జోడించింది. వీరిద్దరూ కనుక నిలబడకపోయి ఉంటే లక్నో పరిస్థితి మరో విధంగా ఉండేది. 168 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. అనవసరమైన షాట్ కు యత్నించి డేవిడ్ వార్నర్ బంతిని వికెట్ల మీదకి ఆడుకున్నాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఠాగూర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో పృథ్వీ షా (32), జేక్ ఫ్రేజర్ తో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. ఫలితంగా ఢిల్లీ జట్టు ఆరు ఓవర్లకు 62 పరుగులు చేసింది. ఆ తర్వాత రవి బిష్ణోయ్.. పృథ్వీ షా ను అవుట్ చేసాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని పృథ్వీ స్లాగ్ స్వీప్ షాట్ అడగా.. డీప్ మిడ్ వికెట్ లో పూరన్ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు. దీంతో ఒక్కసారిగా ఢిల్లీ స్కోర్ మందగించింది. పరుగులు రావడం కష్టమైంది. సింగిల్స్ కూడా రిషబ్ పంత్, ఫ్రేజర్ తీసేందుకు ఇబ్బంది పడ్డారు. 29 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు.

ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ ఓడిపోతుందని ఢిల్లీ అభిమానులు ఒక అంచనాకు వచ్చారు. అంతే ఒక్కసారిగా పంత్ తన రూట్ మార్చాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో 6, 4 కొట్టాడు. స్టోయినిస్ బౌలింగ్లో రివర్స్ స్కూప్ లో ఫోర్ బాదాడు. దీంతో ఢిల్లీ స్కోరు 12 ఓవర్లకు 100 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత కృనాల్ పాండ్యా ఓవర్లో ఫ్రేజర్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.. అదే ఈ మ్యాచ్ మలుపునకు కారణమైంది.. ఈ ఓవర్లో 21 రన్స్ రావడంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గింది.. ఫ్రేజర్ హాఫ్ సెంచరీ చేశాడు.. అంతేకాదు పంత్, ఫ్రేజర్ మూడో వికెట్ కు 77 పరుగులు జోడించారు. కాని చివరి ఓవర్లలో ఫ్రేజర్, పంత్ అవుట్ కావడంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది.. అయితే అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా స్టబ్స్(15*), హోప్(11*) గెలుపు లాంచనాన్ని పూర్తి చేశారు. సిక్స్ కొట్టి స్టబ్స్ మ్యాచ్ ముగించాడు. ఢిల్లీ తో ఓటమి నేపథ్యంలో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి చేరింది. ఢిల్లీ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 9వ స్థానానికి ఎదిగింది.