KTR Harish Rao Unity: రాజకీయాలు వేరు.. రాజ్యాధికారం వేరు.. రెండు ఒకే తీరు పదాల మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ.. వీటికి అర్థాలు వేరే విధంగా ఉంటాయి.. రాజ్యాధికారం కోసం నాయకులు ఎలాంటి పనులైనా చేస్తారు. ఎక్కడి వరకైనా వెళ్తారు. అప్పటిదాకా ఆ లింగంనం చేసుకున్న వారికి వెన్నుపోటు పొడుస్తారు. అప్పటిదాకా దూరంగా ఉన్నవారిని ఆలింగనం చేసుకొని దగ్గరకు చేర్చుకుంటారు. అందుకే రాజకీయాలలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరూ అంటారు. గతంలో ఈ సామెతకు ఎలాంటి అర్థం ఉండేదో తెలియదు కాని.. తెలంగాణ రాజకీయాలలో ఇటీవల కాలంలో మాత్రం ఇది నూటికి నూరు శాతం నిజమైంది.. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలో ఇది స్పష్టంగా కనపడింది. కనిపిస్తూనే ఉంది.
Also Read: కేటీఆర్ ను అసలు కేసీఆర్ నమ్మలేదా?
సరిగ్గా ఏడాది క్రితం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆమె కొద్ది రోజులపాటు విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆమెను విడిపించడానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. చివరికి విశ్వ ప్రయత్నాలు అనంతరం బెయిల్ సాధించి.. ఆమెను బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే కవిత రాసిన లేఖలు బయటకు వచ్చాయో అప్పటినుంచి భారత రాష్ట్ర సమితిలో ఒక్కసారిగా లుకలుకలు మొదలయ్యాయి. దీనికి తోడు ఒకే నీడన ఉన్న నాయకులు మొత్తం వేరువేరు వర్గాలుగా మారిపోయారు.. గతంలో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు, సిద్దిపేట శాసనసభ్యుడి మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీనికి తోడు భారత రాష్ట్ర సమితి రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావుకు పదవి ఇవ్వలేదు. దీంతో గులాబీ దళపతి మేనల్లుడు వేరే కుంపటి పెడుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వాస్తవం తెలుసుకున్న గులాబీ దళపతి ట్రబుల్ షూటర్ కు మంత్రి పదవి ఇచ్చారు. స్వయంగా తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ట్రబుల్ షూటర్ కు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్గంగా ఉన్నవారు కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేసేవారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా హరీష్ రావును ఉద్దేశించి వారు ఈ పనులు చేశారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై మీడియా రకరకాల ఊహాగానాలను.. ఊహాజనితమైన కథనాలను ప్రసారం చేసింది. తర్వాత సైలెంట్ అయిపోయింది. అయినప్పటికీ ట్రబుల్ షూటర్, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య అగాధం లేదని కాదు.. కాకపోతే దానిని అంతగా బయటపడనిచ్చేవారు కాదు.
Also Read: కేటీఆర్ బుల్లెట్ ఎదురుతిరిగిందా..?
ఎప్పుడైతే జాగృతి అధినేత్రి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందో.. అప్పటినుంచే బావాబామ్మర్దులు కలిసిపోయారని ప్రచారం జరుగుతోంది.. కవిత వ్యవహారం పార్టీకి అగాధాన్ని కలిగించక ముందే కేటీఆర్, హరీష్ రావు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. అందువల్ల ఇటీవల కేటీఆర్ రెండుసార్లు హరీష్ రావు ఇంటికి వెళ్లారు. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇద్దరు కూడా కలిసి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.. గతంలో ఎవరి దారి వారు అన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం సర్దుకుపోదాం.. కలిసి నడుద్దాం అనే స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు. తద్వారా క్యాడర్ మొత్తాన్ని ఏకతాటిపై ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి.. కవిత ప్రభావం పార్టీ మీద ఎలా ఉంటుంది.. అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి కవిత వల్ల బావాబామ్మర్దులు కలిసిపోయారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో మీరు ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాల్సి ఉంది.