HomeతెలంగాణKTR: కేటీఆర్‌.. మీకు అర్థమవుతుందా?

KTR: కేటీఆర్‌.. మీకు అర్థమవుతుందా?

KTR: రాజకీయాల్లో నేతలకు ఆలోచన ఉండాలి.. ఆవేశం కాదు.. ఆత్మవిశ్వాసం ఉండాలి.. అహంకారం కాదు. అహంకారం ఉంటే.. ఏమవుతుందో ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. ప్రజాస్వామ్యంలో గెలిపించిన ప్రజలను విస్మరించి.. నేను నా కుటుంబం బాగుంటే చాలు అన్న ధోరణి.. ప్రజలకు మేం తప్ప వేరే దిక్కులేదు అన్న అహంకార ధోరణి బీఆర్‌ఎస్‌ను అధికారం నుంచి దించేసింది. ఈ విషయం కిందిస్థాయి నుంచి వచ్చిన నేతలందికీ అర్థమైంది. కానీ, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌)కు మాత్రం అర్థం కావడం లేదు. కిందిస్థాయి నుంచి వచ్చిన నేతలు ఆవేశం చూపించినా అందులో ఆలోచన ఉంటుంది. అహంకారంతో మాట్లాడినా అందులో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. దీనిని ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ మధ్యలో పుట్టుకొచ్చిన నేతలకు ప్రజస్వామ్యం విలువలు తెలియవు. ప్రజలంటే ఎప్పటికీ చులకన భావమే ఉంటుంది. ఎందుకంటే ఆ నేతలు ప్రజల్లో నుంచి రాలేదు. ఇలాంటి నేతలతో ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ, వారిని నమ్ముకున్న పార్టీ నట్టేట మునుగుతుంది. ఈ సమస్యను ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఎదుర్కొంటోంది. పార్టీ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాడనుకున్న కేటీఆర్‌ చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీని ప్రజల్లో మరింత చులకన చేస్తున్నాయి. పంచెలు ఊడేలా కొండతం.. చెప్పుతో కొడతం.. సర్కార్‌ను కూలగొడతం.. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటం లాంటి మాటలు ఆ పార్టీపై మరింత అసహ్యాన్ని పెంచుతున్నాయి.

ఓటమిని ఒప్పుకోలేక..
పార్టీ బాధ్యతలు తీసుకున్న నేతలు గెలుపు, ఓటములను అంగీకరించాలి. గెలిచినప్పుడు నావల్లే గెలిచిందని జబ్బలు చర్చుకుని, ఓడిపోతే మాత్రం.. ఎదుటివారిమీద నిందలు వేసే వాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు. ఇక ప్రజాతీర్పును గౌరవించలేని కేటీఆర్‌ మాటలు ఇప్పుడు ఆ పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. బీఆర్‌ఎస్‌ను ఓడించిన తెలంగాణ ప్రజల్లో ఆ పార్టీ ఓడిపోయిందన్న సింపతీ ఎక్కడా కనిపించడం లేదు. మంచిపనైంది అనేవారే 90 శాతం ఉన్నారు. కానీ, కేటీఆర్‌ మనకు మంచి సీట్లే ఇచ్చారు. మనం ఘోరంగా ఓడిపోలేదు. మనం ఓడిపోలేదు.. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారంతో ఓడిపోయాం అని మాట్లాడడం ఆ పార్టీపై ఉన్న సింపతిని కూడా దెబ్బతీస్తున్నాయి. ఇక రేపో మాపో ప్రభుత్వాన్ని కూలగొడతాం అని కూడా తాజాగా బెదిరింపులకు దిగారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టవచ్చన్న ఆలోచన కేటీఆర్‌కు రావడం.. బీఆర్‌ఎస్‌కు పెను ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది.

కేసీఆర్‌ ఓడించలేదని బీరాలు..
ఓటమిని ఒప్పుకోలేకపోతున్న కేటీఆర్‌.. అధికార పార్టీపై అహంకారంతో మాట్లాడుతున్నారు. ప్రజలు కేసీఆర్‌ను ఓడించలేదని, అసంతృప్త ఎమ్మెల్యేలనే ఓడించారని చెప్పుకొస్తున్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకపోవడంతో తెలంగాణ సమాజం బాధపడుతోందని అని కేసీఆర్‌ తెగ బాధపడిపోతున్నారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. కేసీఆర్‌ ఓడిపోయిందే మంచిదైందనే వారే చాలా మంది ఉన్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణను అమ్మేసేవాడన్న అభిప్రాయమే చాలా మందిలో ఉంది. కామారెడ్డి ఓటర్లు చీకొట్టడమే ఇందుకు నిదర్శనం. ఒక అనామకుడిని గెలిపించిన అక్కడి ఓటర్లు ముఖ్యమంత్రిని ఓడించారంటే.. ఆయనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం. ముఖ్యమంత్రి అయినా, అనామకుడు అయినా ఓటర్ల ముందు ఒక్కటే. వన్స్‌ డిసైడ్‌ అయ్యారంటే.. వద్దనుకున్నవారిని ఓడిస్తారు.. కావాలనుకునేవారిని గెలిపిస్తారు. ఈ చిన్న లాజిక్‌ కూడా కేటీఆర్‌ విస్మరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నేత కాదు.

తనను తానే వంచించుకుంటూ..
కేటీఆర్‌ పార్టీ నేతల్లో ధైర్యం నింపడం కోసం బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణాలను ఎదుటి పార్టీలపై వేస్తున్నారు. తద్వారా ప్రజలు పొరపాటు చేశారని చప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ మాటలు అతనికి, ఆ పార్టీకి రివర్స్‌ కావడం ఖాయం.

ప్రభుత్వాన్ని కూలుస్తావా?
త్వరలోనే కేసీఆర్‌ ను సీఎంను చేసుకుందాం అని కేటీఆర్‌ ప్రకటిస్తున్నారు. అంటే కాంగ్రెస్‌ సర్కార్‌ను కూలుస్తావా. నలుగురు ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వం కూలిపోదు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండొచ్చు. కానీ, అమ్ముడు పోవడానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పుడు సిద్ధంగా లేరు. కేటీఆర్‌ మాటలతో ఆ పార్టీ అసలు స్వరూపం బయటపడుతోంది. రాచరిక ధోరణి కేటీఆర్‌ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం లేకుండా ఉండలేకపోతున్నామన్న టెన్షన్‌ బయటపడుతోంది. ప్రభుత్వాన్ని కూల్చాలంటే.. కేటీఆర్‌కు వ్యవస్థలు సహకరించాలి. కానీ, పదేళ్లు బానిసలుగా పనిచేసిన వ్యవస్థలు ఇప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాయి. తిరగబడితే బొక్కలో వేసి మక్కిలు విరగ్గొడతాయి. ఈ విషయం కేటీఆర్‌కు అర్థం కావడం లేదు. ఇంకా నేను యువరాజును అనే భావనలోనే మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తించడం లేదు. ఎందుకంటే.. కేటీఆర్‌ ప్రజల నుంచి వచ్చిన లీడర్‌ కాదు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న స్థానాల్లో అయినా గెలవాలి అన్న ఆలోచనలో కేటీఆర్‌ ఉన్నారు. లేదంటే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని గ్రహించారు. అయితే ఇందుకోసం ఆవేశంలో, అహంకారంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేటీఆర్‌ తీరును ప్రజలు గమనిస్తున్నారు. అవి ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తున్నాయి. ఓడించినా పొగరు తగ్గలేదన్న భావనను ఏర్పరుస్తున్నాయి. ఇదే ధోరణితో పోతే.. లోక్‌సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లకు మించి రావు. అప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బీఆర్‌ఎస్‌ను కనుమరుగు చేస్తాయి. ఉనికిలో లేకుండా చేస్తాయి. ఇది నూటికి నూరుశాతం నిజం. బీజేపీ కోరుకునేది కూడా అదే. బీఆర్‌ఎస్‌ కనుమరుగైతే.. ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తుంది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్యే వచ్చే ఎన్నికల్లో పోటీ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ బీఆర్‌ఎస్‌ పతనాన్నే కోరుకుంటోంది. ఈ విషయాన్ని కేసీఆర్‌ అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదు. కేటీఆర్‌ ఆవేశానికి పోకుండా ఆలోచన చేస్తే ఈ విషయం అర్థమవుతుంది.

పులి వస్తుందని..
ఇక కేసీఆర్‌ను పులిగా చూపే కేటీఆర్‌ మాటలు.. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెంచుతున్నాయి. అసలు కేసీఆర్‌ పులి అయితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. సీఎం రేవంత్‌ ముందు తలెత్తుకుని ఎందుకు నిలబడడం లేదు. కనీసం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోతున్న కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోవచ్చు. ఎందుకంటే.. కేసీఆర్‌పై ఎక్కువ కసిగా ఉన్నది రేవంత్‌రెడ్డే. ఆయన ముందు నిలబడి తొడగొట్టాలని చూస్తే జీ బలిసిన కోడి చికెన్‌షాపు ముందుకు వెళ్లి తొడగొట్టినట్లే ఉంటుంది. ఎందుకంటే.. ప్రతీకారంతో రేవంత్‌ రగిలిపోతున్నారు. అంతలా కేసీఆర్‌ రేంత్‌ను గతంలో టార్చర్‌ చేశారు. ఇప్పుడు అధికారం మారింది. ప్రస్తుతం రేవంత్‌ ప్రశాంతంగా కనిపిస్తున్నా లోక్‌సభ ఎన్నికల తర్వాత పంచా విప్పడం ఖాయం. పులి బయటకు వస్తే బోనులో బందిస్తామని రేవంత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఆయనలోని ప్రతీకారానికి నిదర్శనం.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటే..
కేటీఆర్‌ ఇప్పటికైనా తెలంగాణ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ఓటమిని అంగీకరించాలి. ప్రజలు ఏ బాధ్యత అప్పగించారో దానిని నిర్మాణాత్మకంగా నిర్వర్తించాలి. ప్రజల్లో మళ్లీ పార్టీపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి. అలా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టేసి.. తాము అధికారం చేపట్టబోతున్నామని గాల్లో తేలిపోవడం.. తాము తప్ప తెలంగాణలో అధికారం అనుభవించడానికి లేదన్నట్లుగా వ్యవహరించడం బీఆర్‌ఎస్‌ను పతనం చేస్తుంది. కేటీఆర్‌ మీకు అర్థమవుతుందా.. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలోని బేసిక్‌ ప్రిన్సిపుల్స్‌ తెలుసుకుని పాటించండి.. పనిచేయండి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version