KTR Beard: భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎప్పుడు కూడా క్లీన్ షేవ్ తో కనిపిస్తారు. పైగా ఆయన డ్రెస్సింగ్ విధానం కూడా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు సూటు బూటు ధరిస్తారు. తెలంగాణలో ఉంటే మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తారు. అట్టహాసానికి వెళ్లరు. సగటు తెలంగాణ వాది ఆహార్యాన్ని కొనసాగిస్తారు.
కేటీఆర్ ఇటీవల కాలంలో మీసాలు పెంచుతున్నారు. గడ్డంతో కనిపిస్తున్నారు. గతంలో అంటే అమెరికాలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇదే విధంగా ఉండేవారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన అనంతరం ఆయన తన బాడి స్టైల్ మొత్తం మార్చుకున్నారు. అప్పటినుంచి నిన్న మొన్నటి వరకు క్లీన్ షేవ్ తో కేటీఆర్ కనిపించారు.. అయితే ఇప్పుడు మీసాలు.. గడ్డం పెంచడంతో కేటీఆర్ సరికొత్తగా కనిపిస్తున్నారు..
గతంలో రాజకీయ నాయకులు తమ ఆహార్యాన్ని మార్చుకున్నప్పుడు పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాజకీయాలు వ్యక్తిగత దాడులకు కేంద్ర బిందువులుగా మారిన తర్వాత విమర్శలు పెరిగిపోయాయి. బాడీ షేమింగ్ పరిపాటిగా మారిపోయింది. ఒక రాజకీయ నాయకుడు లావుగా ఉంటే ఎగతాళి చేస్తున్నారు. పొట్టిగా ఉంటే విమర్శలు చేస్తున్నారు. జుట్టు లేకపోతే ఆరోపణలు చేస్తున్నారు. జుట్టు పెంచుకుంటే మరో విధంగా అంటున్నారు. వాస్తవానికి ఇలాంటి రాజకీయాలను తెలంగాణ ప్రజలు కోరుకోరు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఇలాంటి చౌకబారు పాలిటిక్స్ చేయడం అలవాటుగా మారిపోయింది.
గతంలో అంటే 2018లో ఎన్నికలు వచ్చినప్పుడు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు తాను గడ్డం మీసాలు తీయనని నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి వాగ్దానం చేశారు. ఆయన చేసిన ఆ వాగ్దానాన్ని కెసిఆర్ విమర్శించారు. గడ్డం మీసాలు తీయకపోతే గుడ్డేలుగు మాదిరిగా నువ్వే ఉంటావని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కెసిఆర్ కుమారుడు కేటీఆర్ గడ్డాలు మీసాలు పెంచుతున్నారు. నాడు కెసిఆర్ అన్న మాటలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
వాస్తవానికి ఇటువంటి పరిణామాలను ఎవరూ హర్షించరు. రాజకీయాలలో ఇటువంటి విధానాలు అస్సలు సరైనవి కాదు. రాజకీయ నాయకులు హుందాగా ఉండాలి. సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అలాకాకుండా వ్యక్తిగత విమర్శలు చేసుకొని.. అడ్డగోలుగా మాట్లాడుకుంటే వాటిని రాజకీయాలు అనరు. అటువంటి తుచ్చ రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరైనది కాదు. ఇక తాజాగా కేటీఆర్ గడ్డాలు మీసాలు పెంచడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బయట పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అంటే కచ్చితంగా గడ్డాలు, మీసాలు పెంచుకోవాలని ఎవరో జ్యోతిష్యుడు చెప్పారట. అప్పటినుంచి కేటీఆర్ ఇదే ఫాలో అవుతున్నారట.
ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు . గడ్డాలు మీసాలు పెంచుకోవడం కేటీఆర్ ఇష్టం. తొలగించుకోవడం కూడా ఆయన ఇష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడం అస్సలు సరికాదు. అరవింద్ చేసిన వ్యాఖ్యల పట్ల గులాబీ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. గడ్డాలు మీసాలు పెట్టుకొని.. అరవింద్ గుండు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అభివృద్ధి లేదా ప్రజల సమస్యలు వంటి వాటి మీద జరగాల్సిన చర్చ ఇప్పుడు గడ్డాలు, మీసాల మీద జరగడం తెలంగాణలో దిగజారుతున్న రాజకీయాలకు ప్రబలమైన నిదర్శనం.