KTR Apology Controversy: పాత్రికేయం పాత్రికేయం మాదిరిగా చేయాలి. అందులో వ్యక్తిగత విశ్లేషణలకు తావు ఉండకూడదు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి.. ఇదే పాత్రికేయం అంటే ఎవరూ ఊరుకోరు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఎవరూ దానిని ఒప్పుకోరు. ముందుగా మాటలతో చెప్పి చూస్తారు. అప్పటికీ వినకపోతే భౌతిక దాడులకు దిగుతారు. వాస్తవానికి భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు.
Also Read: Konda Murali: 16 ఎకరాలమ్మీ 70 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో తెలంగాణలో చోటుచేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు పై మహా టీవీ కొన్ని కథనాలను ప్రసారం చేసింది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వీటి ప్రసారం విషయంలో ఏ ఛానల్ తప్పుడు థంబ్ నేల్స్ పెట్టడం వివాదానికి కారణమైంది. దీనిని గులాబీ పార్టీ అనుకూల కార్యకర్తలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ అలాంటి థంబ్ నేల్స్ పెట్టడాన్ని వారు తట్టుకోలేక పోయారు.. మరో మాటకు తావు లేకుండా దాడులకు దిగారు. ఈ దాడులలో మహా న్యూస్ కార్యాలయం ధ్వంసం అయింది. అద్దాలు పగిలిపోయాయి. వాహనాలు పనికిరాకుండా పోయాయి. ఈ ఘటన తర్వాత తెలంగాణ మంత్రులు మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు తావు లేదని పేర్కొన్నారు.
ఈ ఘటనను భారత రాష్ట్ర సమితి నాయకులు సమర్ధించుకోగా.. మిగతా వర్గాలు విమర్శించాయి. అలాగని మహా న్యూస్ చేసిన పనిని ఎవరూ ఒప్పుకోలేదు. ఇలాంటి దాడులకు పాల్పడే విధానాన్ని వారు ఏమాత్రం సమర్ధించలేదు. తప్పుడు వార్తలను ప్రసారం చేసినప్పుడు న్యాయపరంగా వెళ్లాల్సి ఉండేదని .. అలాకాకుండా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటం సరికాదని సీనియర్ పాత్రికేయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగానే మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ లైన్ లోకి వచ్చారు. ఘటన జరిగిన రోజు ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు చేసి ఇటువంటి సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక తర్వాత ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులో ఉన్న మాటను వ్యక్తం చేశారు.
Also Read: ఏబీఎన్ ఛానల్ ప్రసారాలను నిలిపివేయడంతో రాధాకృష్ణ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు
జరిగిన ఘటనకు భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాధ్యత వహించాలని.. ఆయన తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు భావి రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న కేటీఆర్ క్షమాపణ చెప్తే హుందాగా ఉంటుందని వంశీ వ్యాఖ్యానించారు. ఇక ఈ వీడియోను ఆ యూట్యూబ్ ఛానల్ తెగ ప్రసారం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా రోజులు కాబట్టి.. పైగా గులాబీ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్ గా ఉంది కాబట్టి.. వంశి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అడ్డగోలుగా వార్తలను ప్రసారం చేయడమే కాకుండా.. ఇప్పుడు ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. క్షమాపణ చెప్పాలని కోరుకోవడం ఏంటని మండిపడుతోంది. ఇటువంటి వ్యక్తులు పాత్రికేయులుగా ఎలా చెలామణి అవుతున్నారో అర్థం కావడం లేదని గులాబీ సోషల్ మీడియా విభాగం వ్యాఖ్యానిస్తోంది.