Konda Surekha: కొండా సురేఖ రాజీనామా.. బీఆర్ఎస్ సృష్టియేనా?

గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మంత్రి సినీనటుడి మీద ఆరోపణలు చేసినందుకు.. ఈసారి సినీలోకం మొత్తం ఏకమైంది. ముక్తకంఠంతో కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించారు. ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. అటు నాగార్జున సైతం ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు.

Written By: Srinivas, Updated On : October 7, 2024 12:20 pm

Konda Surekha resignation

Follow us on

Konda Surekha: రాజకీయాల్లో ఎదుటి వారిని దెబ్బతీసేందుకు అసత్య ప్రచారాలు.. నిరాధార ఆరోపణలే ఎక్కువ. ప్రత్యర్థిని మానసికొంగా దెబ్బతీసేందుకు అదో రకమైన రాజకీయం. నిన్నామొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కొండా సురేఖ ఎపిసోడ్ సృష్టించిన ప్రళయం అంతాఇంతా కాదు. రాజకీయాల నుంచి ఏఖంగా సినీ పరిశ్రమకు వివాదం పాకింది. కేటీఆర్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేసే క్రమంలో మధ్యలో కొండా సురేఖ.. సినీనటుడు నాగార్జునను లాగారు. అతని కొడుకు నాగచైతన్య-సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలు కాస్త దుమ్ముదుమారం రేపాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మంత్రి సినీనటుడి మీద ఆరోపణలు చేసినందుకు.. ఈసారి సినీలోకం మొత్తం ఏకమైంది. ముక్తకంఠంతో కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించారు. ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. అటు నాగార్జున సైతం ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలకు దిగారు. పరువు నష్టం దావా వేశారు. ఇక నాగార్జున భార్య అమల అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో మాట్లాడారని ప్రచారం జరిగింది. ఏకంగా కొండా సురేఖ చర్యలు తీసుకుంటారని టాక్ నడిచింది.

వీటన్నింటి క్రమంలో కొండా సురేఖ పొలిటికల్ లైఫ్ ఇక ప్రశ్నార్థకంలో పడిందనే అందరూ భావించారు. ఒకానొక సందర్భంలో ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ఏఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని, మంత్రి పదవికి సురేఖను రాజీనామా చేయమన్నారని వినిపించింది. అయితే.. అదంటే వట్టిదే అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొట్టివేసింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ నిన్న ఇదే విషయమై క్లారిటీ కూడా ఇచ్చారు. ఏఐసీసీ నుంచి సురేఖను వివరణ కోరింది అవాస్తవమని చెప్పుకొచ్చారు.

అయితే.. ఈ ప్రచారం వెనుక ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే అని తెలుస్తోంది. కేవలం కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేయడానికే గులాబీ పార్టీ సురేఖ రాజీనామా అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సినీతారలు స్పందించడం వెనుక కూడా బీఆర్ఎస్ నేతలే ఉన్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. రాజకీయంగా లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ఇంత డ్రామా ఆడినట్లుగా కాంగ్రెస్ వర్గాలు సైతం ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ కుట్రలను తెలుసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ లేదని, ఇలాంటి రాజకీయాలు పనికిరావని కాంగ్రెస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మైండ్ గేమ్‌లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రి రాజీనామా ప్రచారాన్ని జోరుగా సాగించారని.. సురేఖతో రాజీనామా చేయించేందుకు మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా లేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు.. నిన్న ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ కొండా సురేఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం కనిపించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సురేఖకు ముఖ్యమంత్రి రేవంత్ ప్రాధాన్యం కల్పించారు. ఈ పరిణామాన్ని చూసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నోళ్లు కరుచుకున్నట్లుగా తెలిసింది. మంత్రి పదవి పోతుందని భావిస్తే.. ప్రభుత్వం మళ్లీ పెద్దపీట వేస్తున్నదే అని ఆశ్చర్యానికి గురయ్యారట. అంత ప్లాన్ చేసినప్పటికీ ఇలా దెబ్బకొచ్చిందే అని లోలోపల మదనపడుతున్నారని పొలిటికల్ వర్గాలో టాక్ నడుస్తోంది.