AP Flood Relief : ఇటీవల ఏపీకి వచ్చిన వరదలు చాలా జిల్లాలకు నష్టం చేకూర్చాయి.ముఖ్యంగా కృష్ణా,గుంటూరు జిల్లాలకు అపార నష్టం కలిగింది. విజయవాడ నగరంలో వరద బీభత్సం సృష్టించింది. దాదాపు నగరంలో సగానికి పైగా ముంపు బారిన పడింది. అప్పట్లో ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కేంద్ర బలగాలతో సహాయ చర్యలను చేపట్టారు. బాధితులకు నిత్యవసరాలతో పాటు ఆహారాన్ని అందించారు. అయితే వరద వచ్చి నెల రోజులు దాటుతున్న ఇంకా బాధితులకు పరిహారం అందలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. శత శాతం వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇప్పటికే 98 శాతం వరకు వరద బాధితులకు పరిహారం అందింది. కానీ సాంకేతిక కారణాలతో కొంతమంది ఖాతాల్లో వరద సాయం జమ కాలేదు. వీరందరికీ సోమవారం పరిహారం అందజేయనుంది ప్రభుత్వం. మొత్తం 21 769 మంది బాధితుల ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వరద బాధితులందరికీ పరిహారం అందిస్తామని.. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
* గత నెలలోనే సాయం
వాస్తవానికి గత నెలలో వరద బాధితుల కోసం ప్రభుత్వం 602 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే బ్యాంక్ ఖాతాలో తప్పులు, ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం తదితర కారణాలతో చాలామంది ఖాతాల్లో నగదు జమ కాలేదు. అయినా సరే అప్పట్లో 98 శాతం మందికి పరిహారం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద స్వయంగా ప్రకటించిన మొత్తం 602 కోట్ల రూపాయలలో.. పద్దెనిమిది కోట్లు మాత్రమే మిగిలినట్లు చెప్పుకొచ్చింది. అటువంటి వారికి ఈరోజు పరిహారం అందునుంది.
* కేంద్రం సాయం.. ఆపై సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు
ఎన్టీఆర్ జిల్లాలో 15 వేల కుటుంబాలు, అల్లూరి జిల్లాలో 4620 కుటుంబాలకు పరిహారం ఈరోజు అందనుంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీకి వరద సాయం కింద 1000 కోట్ల వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నేరుగా పరిహారానికి ప్రభుత్వం 602 కోట్లు ఖర్చు చేసింది.మరోవైపు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చాయి. దాదాపు 400 కోట్ల రూపాయలు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.అయితే వర్షంతో దెబ్బతిన్న అన్ని రంగాలను ఆదుకునేందుకు ఈ మొత్తాన్ని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.