Komatireddy Raj Gopal Reddy: ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలలో ప్రతిరోజు మీడియాలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటీవల కాలంలో తన స్వరం పెంచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
Also Read: బ్రూక్ భయ్యా కూడా.. మన పంత్ లాగే.. ఇలా కూడా బ్యాటింగ్ చేస్తారా?
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఒక కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..” నాకు మంత్రి పదవి రాకుండా ఎంతకాలం ఆపుతారు. పదవులు మీరు తీసుకుని.. పైసలు కూడా మీరే తీసుకుంటారా. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రిని నేను గతంలో అడిగాను. నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతున్నాను. మంత్రులను నిధుల కోసం అడిగినప్పటికీ స్పందన లభించడం లేదు. నాకు మంత్రి పదవి అనేది ఒక బాధ్యత లాంటిది మాత్రమే. ఆ మంత్రి పదవి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని” రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం వెనక అనేక విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పేరుతో గణపతి హోమం నిర్వహించారు. ఆయన విజయవంతంగా తన పరిపాలన సాగించాలని కోరారు. అవసరమైతే మరో పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ కొనసాగాలని తన అభిమతాన్ని వెంకటరెడ్డి వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి మాటకు జై కొడుతున్న నేపథ్యంలో.. తనకు ఇక మంత్రి పదవి రాదని రాజగోపాల్ రెడ్డి ఫిక్స్ అయ్యారా.. తనకు మాట ఇచ్చిన అధిష్టానం మాట తప్పిందని ఒక అంచనాకొచ్చారా.. అందువల్లే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాదని అంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో అటు ప్రభుత్వాన్ని.. ఇటు అధిష్టానాన్ని ఏకకాలంలో విమర్శిస్తున్న నేపథ్యంలో.. త్వరలో భారత రాష్ట్ర సమితిలోకి వెళ్లే ఏర్పాటు ఏమైనా చేసుకుంటున్నారేమో.. లేదా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారేమోనన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.. మొన్నటిదాకా మంత్రి పదవి ఇవ్వాలని కోరిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడేమో తనకు మంత్రి పదవి అవసరం లేదని చెప్పడం.. నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.