Khammam Reporter Scam: ఖమ్మం జిల్లాలో ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్ సైబర్ నేరాలకు పాల్పడిన తీరు పోలీసులకే చుక్కలు చూపిస్తోంది.. ఆ రిపోర్టర్ కు అదే పత్రికలో పనిచేసే పెద్ద తలకాయ సపోర్టు ఉంది. అదే పత్రికలో రిపోర్టింగ్ విభాగంలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తి కూడా సహకరించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టర్ వసూలు చేసిన డబ్బు.. గోవా టూర్లకు తీసుకెళ్లిన తీరు.. ఇతర వ్యవహారాలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. అంతేకాదు ఆ రిపోర్టర్ ఖాతాలో ఇటీవల 10 లక్షల వరకు విత్ డ్రా కావడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. సదరు రిపోర్టర్ ఖాతాలో ఏడాదికాలంగా కోటి ఎనభై లక్షల వరకు నగదు నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా ఆ రిపోర్టర్ అసలు బాగోతం బయటపడినట్లు తెలుస్తోంది.
Also Read: పవన్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: లోకేశ్ సంచలన నిర్ణయం
పెట్టుబడి పెడితే డబుల్ లాభాలు వస్తాయని సదరు రిపోర్టర్ తో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు ఖమ్మం, ఇతర ప్రాంతాలలో ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు. కరీంనగర్ జిల్లాలో వసూలు చేసిన డబ్బులు కొంతమందికి రెట్టింపు లాభాలు ఇచ్చారు. దీంతో చాలామంది సదరు రిపోర్టర్ చెప్పిన ఖాతాకు డబ్బులు పంపించారు. ఎప్పుడైతే డబ్బు భారీగా ఖాతాల్లోకి వచ్చిందో.. అప్పుడే ఆ రిపోర్టర్, అతడి బృందం సరికొత్త ఎత్తులు వేసింది. డబ్బులు చెల్లించిన వారిని గోవా టూర్లకు తీసుకెళ్లింది. వారితో కాసినోవా జూదం ఆడించింది. ఈ భారీ మోసంలో మొత్తం ముగ్గురు నిందితులు ఉన్నారు. అయితే తెర వెనుక చాలామంది ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సదరు రిపోర్టర్ పనిచేసే పత్రికలో ఉన్న పెద్ద తలకాయ.. ఇంకా కొంతమంది వ్యక్తులు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ విలేకరిని విచారిస్తున్న నేపథ్యంలో వారి పేర్లు బయటికి వస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సదర్ విలేకరిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసులలో ఖమ్మంలో రెండు.. మహారాష్ట్రలోని వార్దా, సేవాగ్రామ్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బలుదు పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదయింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారేపల్లి, ఖానాపురం, కూసుమంచి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయ్యాయి.. కొత్త మూడు రాష్ట్రాలలో సదరు పత్రికలో పనిచేసే రిపోర్టర్ మీద కేసు నమోదు అయ్యాయి.
Also Read: జగన్ ఓడిపోతారని నేను ఊహించలేదు.. కేటీఆర్ కామెంట్స్ వైరల్!
ఆ విలేఖరి ఖాతాలో దాదాపు రెండు కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పెట్టింపు లాభాల పేరుతో వసూలు చేసిన కోట్ల డబ్బు ఎవరెవరి ఖాతాలకు వెళ్లిందనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రముఖ పత్రికలో పనిచేసే ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాకు ఈ విలేకరి ఖాతా నుంచి భారీగా డబ్బు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఆ విలేఖరి తో పాటు ఆ పత్రికలో పెద్ద తలకాయను, ఇంకో ఉప తలకాయను చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇక పత్రికకు చెందిన ఆ ముఖ్య వ్యక్తి బ్యాంకు లావాదేవీలను.. విలేకరి లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే ఈ విలేకరి అరెస్టు అయ్యాడో.. అప్పటినుంచి ఆ పెద్ద తలకాయ వణికి పోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతడు సైలెంట్ అయ్యాడని.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం ఆ పత్రికలో భారీ ఎత్తున కుదుపునకు కారణం అవుతున్నట్టు సమాచారం.