Andhra Telangana politics: శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ ఫార్ములా అనేది ప్రతి రంగానికి వర్తిస్తుంది. ఇలానే ఎక్కువగా స్నేహాలు కుదురుతాయి కూడా. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇదే ఫార్ములా ఎక్కువగా వర్కౌట్ అయింది. చంద్రబాబు( CM Chandrababu) అంటే కెసిఆర్ కు పడదు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో.. ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు కెసిఆర్. అప్పటినుంచి వారిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర విభజనతో చంద్రబాబు ఏపీకి రాగా ఇక్కడ రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి మారారు. దీంతో సహజంగానే జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు కెసిఆర్. వారిద్దరూ కలిసి వ్యూహం పన్నడంతో చంద్రబాబు చిత్తు కావాల్సి వచ్చింది. ఇప్పుడు అదే చంద్రబాబు తిరిగి వ్యూహం రూపొందించి రెండు రాష్ట్రాల్లో ఇద్దరినీ అధికారం నుంచి దూరం చేశారు.
విభిన్న రాజకీయ పరిస్థితులు..
ఏపీలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి. తెలంగాణలో మాత్రం సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబుకు ప్రత్యర్థి. అటు ఏపీలో వైసిపి అధికారానికి దూరమైంది. తెలంగాణలో కెసిఆర్ పార్టీకి కష్టతరంగా ఉంది. అందుకే ఆ రెండు పార్టీలు పరస్పర రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్తున్నాయి. కానీ అది బాహటంగా కాదు. తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ఆ రెండు పార్టీలకు ఇప్పుడు ఉమ్మడి శత్రువు చంద్రబాబు. అటు తరువాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంచి అవగాహన ఉంది. దానిని జీర్ణించుకోలేకపోతోంది జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ ద్వయం. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం పతాక స్థాయిలో ఉంది.
Also Read: రాష్ట్రమంతా ఉచిత బస్సు ఇయ్యాలి..మహిళలు సర్దుకుపోతారంటారా? ఇవేం నిబంధనలు ‘సీఎం’ సారూ!
సంచలన కామెంట్స్
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు కేటీఆర్( KTR). బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఢిల్లీలో పర్యటించారు. ఆ సమయంలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా సరే ఆ పార్టీకి 40 శాతం ఓట్లు రావడం మరిచిపోకూడదన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది తర్వాత కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీలో భిన్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఏపీలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా రాణిస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే మాట సాయం అవసరం. అందులో భాగంగానే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జల వివాదం నేపథ్యంలో..
ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తోంది. ఏపీలో చంద్రబాబు సర్కార్ బనకచర్ల ప్రాజెక్టును( Banka Challa project ) తెరపైకి తెచ్చింది. అయితే దీంతో తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బతింటాయని రేవంత్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కెసిఆర్ జలవివాదాలు పరిష్కరించడంలో చొరవ చూపకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని రేవంత్ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో రాయలసీమ కోసం ఈ ప్రాజెక్టు అంటూ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీల పరిస్థితి భిన్నంగా మారింది. అందుకే ఒకరినొకరు సహకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా.. 40 శాతం ఓటు బ్యాంకు తెచ్చుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.