Lok Sabha Election 2024: పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ వేసే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరీంనగర్, ఖమ్మం పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంతవరకూ కేటాయించలేదు. ఈ సీట్ల సంబంధించి రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నాయకులు తమకే సీటు దక్కిందని లీకులు ఇస్తున్నారు. తనకు అనుకూలమైన మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు. అయితే ఇంతవరకు కరీంనగర్, ఖమ్మం పార్లమెంటు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎవరికీ టికెట్లు కేటాయించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంటు స్థానం టికెట్ కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. వారి స్థాయిలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు.. నేతలు ఎవరికి వారే పంతాలకు పోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖమ్మం స్థానం నుంచి ప్రియాంకా గాంధీని పోటీలోకి దించనుందని తెలుస్తోంది. దీనిపై గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తీవ్రంగా పోటీ పడుతున్నారు. రాయల నాగేశ్వరరావుకు భట్టి విక్రమార్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అటు రఘురామిరెడ్డి పొంగులేటి వియ్యంకుడు కావడంతో.. ఆయన కూడా భారీగానే తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. మండవ వెంకటేశ్వరరావుకు తుమ్మల నాగేశ్వరరావు సహకారం ఉందని తెలుస్తోంది.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండగానే.. ఖమ్మంలో రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీరి పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేయలేదు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేరళ రాష్ట్రానికి పయనమయ్యారు. కాంగ్రెస్ సీటుకు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ను కలిశారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి భట్టి విక్రమార్క అనుచరులు గోప్యత పాటిస్తున్నారు.
తన వియ్యంకుడు రఘురామిరెడ్డికి టికెట్ దక్కకపోతే.. తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కైనా టికెట్ ఇప్పించుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా ప్రియాంక పేరు తెరపైకి రావడం గమనార్హం.. రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దాంతోపాటు ఉత్తర ప్రదేశ్ లోని అమేథి పార్లమెంటు స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.. అదే జరిగితే అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది ప్రాంతాలలో పోటీ చేసిన ఘనతను రాహుల్ గాంధీ దక్కించుకుంటారు. ఒకవేళ అమేథిలో కనుక రాహుల్ గాంధీ పోటీ చేస్తే ప్రియాంకా గాంధీ ఖమ్మం నుంచి బరిలో ఉంటారని.. రాహుల్ గాంధీ అమేథిలో పోటీ చేయకుంటే, అప్పుడు ప్రియాంక గాంధీ ఆ స్థానంలో రంగంలో ఉంటారని సమాచారం. అమేథిలో పోటీ చేసేందుకు ప్రియాంకా గాంధీ ఇష్టపడని క్రమంలో ఆమెను రాయ్ బరేలి, ఖమ్మం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇక గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలకంగా భేటీ కానున్న నేపథ్యంలో.. ఖమ్మం, కరీంనగర్ స్థానాలపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది.