Rythu Bharosa:రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. రైతులకు ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసింది తామేనని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తాజాగా రైతుభరోసా అమలు చేస్తానని రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా అమలుపై అసెంబ్లీలో సమర్పించే నివేదికపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. సంక్రాంతి తర్వాత నిధులు జమ చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో నిబంధనలు, షరతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రైతుల్లో కొన్ని ప్రశ్నలు, ఆశలు కలగజేశాయి. రైతు భరోసా పథకం కింద వందల ఎకరాల భూమి ఉన్న వారికి లేదా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడంపై గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఇన్ కమ్ ట్యాక్ చెల్లించే వారికి సాయం చేయడాన్ని కూడా వ్యతిరేకించింది.
రేవంత్ హామీలు
రైతుభరోసాపై ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో ఈ పథకం అమలుపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక సమర్పించి దానిపై చర్చించాలని నిర్ణయించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిజమైన రైతులకు పథకం అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా అమలు చేస్తామన్నారు. ఎవరు అడ్డు వచ్చినా ఈ పథకం అమలు ఆగదని పేర్కొన్నారు. నిర్ణయించిన అర్హతల మేరకు సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తామన్నారు.
నివేదికపై కసరత్తు
అయితే ఇప్పటికే సిద్ధమవుతున్న నివేదికలో కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అర్హత కలిగి ఉండి, నిజమైన రైతులకే లబ్ధి చేకూరేలా కొందరిని మినహాయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు రైతుభరోసా ఇవ్వాలన్న ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. అదేవిధంగా పది ఎకరాలకే పరిమితం చేసే అంశంపై ప్రతిపాదన చేయనున్నారు. దీనిపై అసెంబ్లీలో అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల పేర్లపై ఉన్న భూములకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందించే ఛాన్స్ ఉంది. సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజాభిప్రాయ సేకరణ
దీంతో అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రతిపాదనలు కీలకంగా మారనున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. అదేవిధంగా బీఆర్ ఎస్ హయాంలో అమలు చేసిన పథకంలోని లోటుపాట్లను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పూర్తి అర్హత కలిగిన ప్రతి రైతుకు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. కాగా, రైతుభరోసా అమలుపై ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటనపై రైతుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. రైతు భరోసా పథకం విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా కమిటీ నియమించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత అసెంబ్లీలో దాని పై చర్చించి ఆ తర్వాత రైతు భరోసా పై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.