KCR: ఎన్నాళ్ళకెన్నాళ్లకు… అసెంబ్లీ మీడియా పాయింట్ కు కేసీఆర్

2014లో ఆయన ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఆయన పార్టీకి గొప్పగా అనేతీరుగా సీట్లు రాకపోయినప్పటికీ.. అధికారాన్ని దక్కించుకునే మ్యాజిక్ ఫిగర్ కు మించి సీట్ల శాతం లభించింది. అయితే ఆయన అప్పట్లో తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు కమ్యూనిస్టు నుంచి మొదలుపెడితే టిడిపి వరకు ఆ పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 26, 2024 8:13 am

KCR

Follow us on

KCR: ఓడలు బండ్లవుతుంటాయి. బండ్లు ఓడలవుతుంటాయి. ఇది సహజ పరిణామ క్రమం. ఓడల్లో ఉన్నప్పుడు విర్రవీగొద్దు. బండ్లల్లో కొనసాగినప్పుడు బాధపడొద్దు. కానీ ఈ మాత్రం స్పృహ కొంతమంది రాజకీయ నాయకులకు ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం మేమే అని భ్రమలో బతికేస్తుంటారు. మా వల్లే, మాతోనే, మేము మాత్రమే అనే మాటలను పదేపదే వల్లె వేస్తుంటారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజలకు కోపం కలుగుతుంది. వ్యతిరేక భావన పెరుగుతుంది. అది అంతిమంగా తిరుగుబాటుకు దారి తీస్తుంది. ఇలాంటి పరిణామాలు అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు ఎన్నో జరిగాయి. ప్రజల్లో తిరుగుబాటు మొదలైనప్పుడు దాని పర్యవసనాలను చాలామంది రాజకీయ నాయకులు చవిచూశారు. చివరికి ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మహిళ కూడా ప్రజల తిరస్కారం ముందు తలవంచక తప్పలేదు.. ఇక ఈ జాబితాలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు.

2014లో ఆయన ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఆయన పార్టీకి గొప్పగా అనేతీరుగా సీట్లు రాకపోయినప్పటికీ.. అధికారాన్ని దక్కించుకునే మ్యాజిక్ ఫిగర్ కు మించి సీట్ల శాతం లభించింది. అయితే ఆయన అప్పట్లో తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు కమ్యూనిస్టు నుంచి మొదలుపెడితే టిడిపి వరకు ఆ పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకున్నారు. సీఎల్పీని, టిటిడిఎల్పిని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగించారు. ఆ ఎన్నికల్లోనూ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి బంపర్ మెజారిటీ ఇచ్చినప్పటికీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కేసిఆర్ మానలేదు. పైగా మొయినాబాద్ లాంటి ఎపిసోడ్స్ కూడా చోటుచేసుకున్నాయి. ఇక కెసిఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలలో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో ఆరోపణలు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి కి ప్రతిబంధకంగా మారాయి. ఫలితంగా 2023 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది. దేశ రాజకీయాల్లోకి వెళ్లి చక్రం తిప్పుదామని భావించిన కెసిఆర్ కు ఎన్నికల ఫలితాలు మింగుడు పడకుండా చేశాయి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితికి సున్నా సీట్లు వచ్చాయి. దీనికి తోడు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరడం మొదలుపెట్టారు. దీంతో భారత రాష్ట్ర సమితి బలం తగ్గడం మొదలుపెట్టింది.

రేవంత్ మరింత టార్గెట్ గా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న నేపథ్యంలో.. పార్టీని కాపాడుకునేందుకు కేసిఆర్ రంగంలోకి దిగారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో తొలిసారి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ప్రజల సమస్యలపై నిరసనలు చేపడుతామని అన్నారు. అయితే కెసిఆర్ అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు కెసిఆర్ ను కీర్తిస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ” కెసిఆర్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అధికార పార్టీకి కష్ట కాలమే. ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉంటుంది. ఇందుకోసం వాళ్లు ముందుగానే ప్రిపేర్ అయ్యి రావాల్సి ఉంటుంది. గతంలో కెసిఆర్ ఎన్నోసార్లు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏం చేస్తారో చూడాల్సి ఉందని” వ్యాఖ్యానిస్తున్నారు. మరో వైపు కెసిఆర్ రాకపట్ల కాంగ్రెస్ పార్టీ అనుకూల నెటిజన్లు స్పందించారు. ” ఏవేవో కారణాలు చెప్పి కెసిఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి రాలేదు. ఇకపై ఆ వీల్లేదు. కచ్చితంగా అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ పదేపదే డిమాండ్ చేయడంతో.. కెసిఆర్ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వేసే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై కూడా బదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి పథకానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ గట్టిగా ప్రిపేర్ రావాల్సి ఉంటుంది.. లేకుంటే మాత్రం రేవంత్ నుంచి తీవ్ర విమర్శలు తప్పవని” వారు వ్యాఖ్యానిస్తున్నారు.