KCR: బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరైమాట్లాడారు. తమ పార్టీ ప్రస్థానం వివరించడంతోపాటు తమ పదేళ్ల పాలనలో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై విమర్శల చేశారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పైనా సెటైర్లు వేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను అణచివేసేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఆపరేషన్ పేరుతో గిరిజనులు, అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికార దుర్వినియోగం ద్వారా ప్రాణాలు తీసుకోవడం సమంజసం కాదని ఆయన విమర్శించారు.
Also Read: తెలంగాణలో గులాబీ గర్జన… పోలీసులకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
శాంతి చర్చలకు పిలుపు
మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ, కేంద్రం కూంబింగ్ ఆపరేషన్లు, కాల్పులు నిలిపివేసి చర్చలు ప్రారంభించాలని కేసీఆర్ సూచించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆయన ప్రకటించారు.
బీజేపీపై కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో ఎటువంటి నిధులు ఇవ్వలేదని, ఏడు మండలాలను లాక్కున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై అన్యాయమైన ఆరోపణలు చేశారని ఆయన నిప్పులు చెరిగారు.
తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ అండ
సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని, ప్రజల హక్కుల కోసం పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ఆంధ్రజ్యోతికి ప్రకటనలు లేవ్.. వేమూరి రాధాకృష్ణపై కేసీఆర్ కు కోపం ఇంకా తగ్గలేదా?