KCR: భారత రాష్ట్ర సమతి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడులక పేరిట హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ సీఎం, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ ప్రస్తానం వివరించడంతోపాటు 10 ఏళ్ల తమ పాలన వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
Also Read: పిఓకే లో ఆకస్మిక వరదలు.. అసలు నిజం ఇది!
బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో భాగంగా ఎల్కతుర్తిలో మాట్లాడిన కేసీఆర్ ఈ సభా వేదిక నుంచే తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను అడ్డుకోవడం సరికాదని, పోలీసులు రాజకీయ ప్రేరేపిత చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు.
సభలకు అడ్డంకులు..
ఎల్కతుర్తి సభకు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు రావాల్సి ఉండగా, ట్రాఫిక్ జామ్‌లు, రోడ్లపై అడ్డంకులు, ప్రైవేటు స్కూల్ బస్సులకు నోటీసులు జారీ చేయడం వంటి చర్యలతో అధికారులు సభకు ఆటంకం కలిగించారని కేసీఆర్ ఆరోపించారు. హన్మకొండ, హుజూరాబాద్, సిద్దిపేట మార్గాల్లో లక్షలాది మంది కార్యకర్తలు ఆగిపోయారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియా వారియర్స్‌పై కేసులు..
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ప్రజల తరఫున అన్యాయాలను ప్రశ్నిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, వారిపై కేసులు పెట్టడం సరికాదని కేసీఆర్ అన్నారు. పోలీసులు తమ విధులను నిష్పక్షపాటంగా నిర్వహించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని సూచించారు.
మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా..
తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెస్తారని, దాన్ని ఎవరూ ఆపలేరని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసే వాగ్దానాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని, బీఆర్‌ఎస్ ఎప్పుడూ చట్టాలను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
న్యాయ పోరాటానికి సిద్ధం..
బీఆర్‌ఎస్ శ్రేణులపై అన్యాయంగా కేసులు పెట్టినా, పార్టీ లీగల్ సెల్ ద్వారా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలకు అండగా బీఆర్‌ఎస్, తాను ఉంటామని, అన్యాయాన్ని సహించబోమని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Also Read: సింధు జల ఒప్పందం తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?.. ఆ ప్రాంతం ఎడారిగా మారనుందా?