KCR Assembly: ఏ పున్నానికో.. అమావాస్యకో.. కెసిఆర్ కనిపిస్తున్నారు. అది కూడా సొంత పత్రికలో మాత్రమే దర్శనమిస్తున్నారు. అది కూడా ప్రెస్ నోట్ రూపంలో మాత్రమే.. ఇటీవల కాలంలో తరచుగా అనారోగ్యానికి గురి కావడంతో ఏ యశోద ఆసుపత్రిలోనో.. ఏఐజి ఆస్పత్రిలోనో పరీక్షలు చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అప్పట్లో వరంగల్ సభ ద్వారా కొంతమేర హడావిడి చేసినప్పటికీ తెలంగాణ సమాజానికి అది సరిపోలేదు. వాస్తవానికి ఇక్కడి సమాజం కెసిఆర్ నుంచి కోరుకుంటున్నది ఇది కాదు. తెలంగాణ సమాజానికి ఏం కావాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కేసీఆర్ చేయడం లేదు. మొత్తంగా చూస్తే అటు ఎడం.. ఇటు దూరం భారీగానే పెరిగిపోతోంది. ఇది ఎంతవరకు దారి తీస్తుంది.. ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టం.
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
సహజంగానే కెసిఆర్ ధైర్యవంతులు. అన్నిటికంటే ఎక్కువగా మొండితనం ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు సైలెంట్ అయిపోవడం.. వెనక్కి వెళ్ళిపోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. కాలేశ్వరం విషయంలో అధికార కాంగ్రెస్ దూకుడుగానే ఉంది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలను నిర్ధారించాలని ఏకంగా ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. మీడియాకు ముందుగానే లీకులు ఉంటాయి కాబట్టి.. కొన్ని మీడియా సంస్థలు ఆ కమిషన్ నివేదికను ఉటంకించాయి. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరిగిందని ఆ మీడియా సంస్థలు తాము ప్రచురించిన కథనాలలో పేర్కొన్నాయి.
ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి వ్యవహారం చేరిన ప్రజలకు మరింత వివరించేందుకు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కాలేశ్వరం ద్వారా జరిగిన నష్టాన్ని వివరించనుంది. కొద్దిరోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో.. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకలను చర్చించి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావు పై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.. అయితే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అవినీతి అనేది జరగలేదని.. కెసిఆర్ ను అప్రతిష్ట పాలు చేయడానికి.. భారత రాష్ట్ర సమితిని ఇబ్బందికి గురిచేయడానికే ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాలేశ్వరం ఎత్తిపోతల పథకం గుండెకాయ లాంటిదని.. చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపి తమను బెదిరించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు..ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికలోని అంశాల ఆధారంగా తమను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.. అయితే కెసిఆర్ తప్పకుండా ఈసారి శాసనసభకు వస్తారని కాంగ్రెస్ నేతల నోర్లు మూయిస్తారని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు.. అయితే గులాబీ పార్టీ నాయకులు చెప్పినందుకు గొప్పగా కేసీఆర్ వ్యవహరించడం లేదు. పైగా ఇప్పుడు జరిగే శాసనసభకు కూడా ఆయన హాజరు కావడం లేదు. శనివారం నాటి సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన్నీరు హరీష్ రావు, ఇతర గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.
రేపటి నుంచి అయినా వస్తారా
శాసనసభలో కాలేశ్వరం గురించి కష్టంగా చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిని తెలివిగా డైవర్ట్ చేయడానికి గులాబీ పార్టీ నాయకులు యూరియా కష్టాలు, వరద ఇబ్బందులు, ఇతర వాటి మీద యుద్ధం చేయాలని డిసైడ్ అయింది. వాస్తవానికి గులాబీ దళపతి నేరుగా శాసన సభకు వచ్చి ఉంటే.. కాంగ్రెస్ నేతలను నిలదీసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ సభ కు గులాబీ బాస్ రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు సభకు రాకుండా వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.