KCR: పట్టువిడుపులు మాని అసెంబ్లీకొస్తున్న కేసీఆర్‌.. రేవంత్‌ కోరిక నెరవేరుతోంది.. ఏం జరుగుతుందో?

ప్రతిపక్షనేత హోదాలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్‌రావు తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఏడు నెలల తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 25, 2024 12:10 pm

KCR

Follow us on

KCR: తెలంగాణ ఉద్యమ నేత.. తెలంగాణకు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో కేసీఆర్‌ను అసెంబ్లీ స్పీకర్‌ ప్రతిపక్ష నేతగా గుర్తించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు రెండు పర్యాయాలు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కేసీఆర్‌ సైలెంట్‌ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన ఇంట్లో జారిపడడంతో తుంటి విరిగింది. దీంతో దాదాపు మూడు నెలలు ఆయన బయటకు రాలేదు. లోక్‌సభ ఎన్నికల వేళ.. ప్రచారం కోసం.. కార్యకర్తల్లో నైరాశ్యం తొలగించేందుకు బస్సు యాత్ర నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్‌ఎస్‌ గెలవలేదు. దీంతో నెల రోజులుగా కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. కేటీఆర్, కేసీఆర్‌ మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర పోసిస్తున్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు కోరారు. ఆయన అనుభవం తెలంగాణ ప్రభుత్వానికి అవసరమని కూడా పేర్కొన్నారు. అయినా కేసీఆర్‌ అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు. కానీ ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. సుమారు రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్టెజ్‌లో అత్యధిక కేటాయింపులు రుణమాఫీ, రైతుభరోసాతోపాటు ఆరు గ్యారంటీలకు ఉంటాయని తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన కొద్ది సేపటి క్రితం ఇంటి నుంచి అసెంబ్లీకి బయల్దేరారు.

రేవంత్‌ వినతి..
ఇదిలా ఉంటే కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు విన్నవించారు. అయితే గౌరవంగా ఆహ్వానిస్తున్నారా.. లేక అసెంబ్లీలో అవమానించడానికి పిలుస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేసీఆర్‌ కూడా అసెంబ్లీకి ఇన్నాళ్లూ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం(జూలై 24న) అసెంబీలలో కేంద్రబడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో కూడా కేసీఆర్‌ అసెంబీకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు సూచించారు. రేవంత్‌రెడ్డి వినతికి కేసీఆర్‌ స్పందించినట్లుగా.. గురువారం(జూలై 25న) అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌ రాక కోసం ఎదురు చూస్తున్న సీఎం రేవంత్‌ కోరిక కూడా నెరవేరబోతోంది.

మళ్లీ యాక్టివ్‌ పాలిటిక్స్‌..
కేజీఆర్‌ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌ కాబోతున్నారని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా ఆయన తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇన్నాళ్లూ ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మంగళవారం(జులై 23న) మధ్యాహ్నం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

ప్రతిపక్ష నేత హోదాలో..
కేసీఆర్‌ రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష నేతగా ఎన్నడూ వ్యవహరించలేదు. టీడీపీలో ఉన్న సమయంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఛాన్స్‌ రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత ఆయన ఎంపీగానే పోటీచేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన ముఖ్యమంత్రిగానే తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా 2023 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా ఎన్నికవగా అసెంబ్లీ స్పీకర్‌ ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇచ్చారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు..
అసెంబ్లీ సమావేశాలు మంగళవారం(జూలై 23న) ప్రారంభం అవుతున్నాయి. గురువారం(జూలై 25న) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. దీంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేసేందుకు ఆయన బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజే అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే… బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. 8 మంది ఎమ్మెల్సీలు కూడా గులాబీ పార్టీని వీడి అధికార హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టనుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడతారని ఇటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.