https://oktelugu.com/

CM Chandrababu : జగన్ వైఫల్యాలు చెప్పడమేనా..పాలన చేసేదేముందా? చంద్రబాబు శ్వేత పత్రాల రాజకీయం!

గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయిందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో ఏపీ 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శలు చేశారు. అందుకే ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. కానీ తన విలువైన సమయాన్ని చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై నిందలు వేయడానికి కేటాయిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : July 25, 2024 / 12:11 PM IST
    Follow us on

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతోంది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం గా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.అందులో పింఛన్ల పెంపు అమలు చేయగలిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. కానీ మిగతా విషయాల్లో మాత్రం వెనకబడ్డారు. ఈ 50 రోజుల పాలనలో ప్లస్ లతో పాటు మైనస్ లే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పాలనపై మంత్రులు ఇంకా పట్టు సాధించలేదు. డిప్యూటీ సీఎం పవన్ అయితే అధికారులు తమ మాట వినడం లేదని చెప్పుకొచ్చారు. పరోక్షంగా లోపాన్ని ప్రస్తావించారు. పాలన వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబుకు సంకేతాలు ఇచ్చారు. రోజు రోజుకు తన పదవీకాలం తగ్గుతుందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలి. దానిని గుర్తెరిగి పాలన చేయాలి. వైసిపి పాలనలో విధ్వంసాలు, అవినీతిపై చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. అప్పటి వైఫల్యాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశారు. దీనిని ప్రజలు సానుకూల దృక్పథంతో చూస్తున్నారు. జగన్ పాలనలో ఈ స్థాయిలో అవినీతి జరిగిందా? అని ఆలోచన చేస్తున్నారు. అయితే చంద్రబాబు అదే పనిగా శ్వేత పత్రాలు విడుదల చేస్తే మాత్రం రివర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ చేసినది తప్పే. దానిని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా గుర్తించాల్సిన పనిలేదు. ప్రాథమిక స్థాయిలో వైసిపి హయాంలో జరిగిన అవినీతిని ప్రస్తావించి వదిలేస్తే బాగుంటుంది. ఏదైనా మితిమీరితే మాత్రం కచ్చితంగా అది చంద్రబాబు అయినా.. జగన్ అయినా జనాలకు ఒకటే. అందుకే చంద్రబాబు ఈ శ్వేత పత్రాల రాజకీయం విడిచిపెట్టి.. పాలనపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది.

    * కొన్నింట విజయం
    50 రోజుల పాలనలో చంద్రబాబు సర్కార్ కొన్ని విజయాలను సాధించింది. ముఖ్యంగా పింఛన్లు పెంచి.. లబ్ధిదారులకు అందించింది. అయితే అదే సమయంలో 50 సంవత్సరాలు పైబడిన బీసీ లబ్ధిదారులు కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారందరి ఆకాంక్షలు తీర్చాలి. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దాదాపు 50 రోజులు గడుస్తోంది. తల్లికి వందనం పేరిట ఇస్తామన్న నగదు సాయం అందించాల్సి ఉంది. కొత్త మద్యం విధానం అమలు చేస్తామని చెప్పారు. తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుకూలంగా కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టాలి. ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున నగదు అందిస్తామని చెప్పారు. దానిని కూడా కార్యరూపంలో తేవాల్సి ఉంది. ఏడాదికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. దానిని అమలు చేయాల్సి ఉంది.

    * కేంద్ర నిధుల్లో పర్వాలేదు
    రాష్ట్రానికి కేంద్ర నిధుల విషయంలో చంద్రబాబు సక్సెస్ కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని సాక్షాత్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కూడా స్పష్టం చేశారు. తాజాగా రైల్వే బడ్జెట్లో సైతం రాష్ట్రానికి9000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. అందులో అమరావతికి రెండు వేల కోట్లు కేటాయించారు. ఇవన్నీ 50 రోజుల చంద్రబాబు పాలనలో విజయాలు. కానీ వీటిని అధిగమించే స్థాయిలో మైనస్ లు ఉన్నాయి. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది.

    * నిందలతో సరిపోదు
    గత వైసిపి ప్రభుత్వంపై నిందలు మోపినంత మాత్రాన.. రాష్ట్ర ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఉండదు. జగన్ పాలన వైఫల్యం తోనే.. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలి. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ పేరిట ప్రజల్లో ఒక రకమైన ఆశలు కల్పించారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటించారు. ముందుగా వాటిని అమలు చేసి చూపించాలి. ప్రజల నమ్మకాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకానీ జగన్ వైఫల్యాలతో గడిపేస్తామంటే కుదిరే పని కాదు. అది కూటమి పార్టీలకే చేటుపిస్తుందన్న విషయాన్ని గుర్తించుకోవాలి.